ప్రజాశక్తి - ఆదోని
తప్పుడు క్లెయిమ్‌లతో రీఫండ్ పొందితే అలాంటి వారి పట్ల కఠిన చర్యలు ఉంటామని ఆదాయపు పన్ను శాఖ కర్నూలు రేంజ్ జాయింట్ కమిషనర్ అనిస్ ఖాన్ హెచ్చరించారు. గురువారం ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో ఆడిటర్లు, టాక్స్ బార్ అసోసియేషన్‌తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదాయపు పన్ను వివరాలు తప్పుగా సమర్పించినా, అర్హత లేని మినహాయింపులు క్లెయిమ్ చేసి రీఫండ్ పొందితే పన్ను చెల్లింపు దారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అలాంటి పరిణామాల్లో 12 శాతం వడ్డీతో పాటు 200 శాతం వరకు అపరాధ రుసుం, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందన్నారు. గతేడాది ఆదోని పరిధిలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ రంగసంస్థలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తప్పుడు క్లెయిమ్‌లతో 75-90 శాతం వరకు రీఫండ్ పొందిన ఉదంతాలు బహిర్గతమయ్యాయని తెలిపారు. ఆదోని ఆదాయపు పన్ను అధికారి ఎం.స్టెల్లా రోసలిండ్, నంద్యాల ఆదాయపు పన్ను అధికారి, నందవరం శ్రీధర్ రావు, విశ్వనాథ రెడ్డి, శ్రీనివాస మూర్తి, దైవాధీనం రెడ్డి, మదన్ మోహన్, మహానందయ, సోమశేఖర్ రెడ్డి, మంజునాథ, సురేష్ బాబు రెడ్డి ఉన్నారు.
జామీయా మసీదును సందర్శించిన అనిఫ్ ఖాన్
ఆదోనిలోని షాహి జామియా మసీదును అనిఫ్ ఖాన్ సందర్శించారు. షాహీ జామియా మసీద్ ట్రస్టీ ఆధ్వర్యంలో ఆయనకు సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అతి పెద్ద మసీదుల్లో షాహి జామియా మసీదు ఒకటన్నారు. ఇక్కడ చాలా ప్రశాంతత ఉందన్నారు. ఇక్కడ హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండి మత సామరస్యాన్ని పాటించడం గొప్ప విషయమని తెలిపారు. అనంతరం వ్యాపారవేత్త జమీల్ షఫీ ఆయనకు ప్రత్యేకంగా సన్మానం చేశారు.










