ప్రజాశక్తి - వినుకొండ : ప్రభుత్వ భూమిలో మట్టి అక్రమ తరలింపుపై తాము వాస్తవాలను చూపినందుకు తనతోపాటు టిడిపి కార్యకర్తలపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తప్పుడు కేసులు పెట్టించారని టిడిపి జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఇటువంటి కేసులకు బెదిరేది లేదని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఈ మేరకు స్థానిక టిడిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వినుకొండ మండలం వెంకుపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1 కొండ పోరంబోకు ప్రభుత్వ భూమిలో మట్టిని అక్రమంగా తరలించి ఎమ్మెల్యే తన ఆవుల ఫారాన్ని నింపుకుంటే టిడిపి ఆధ్వర్యంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచామని చెప్పారు. తాము ఆందోళన చేసిన ప్రదేశానికి తహశీల్దార్ కిరణ్ కుమార్, ఇతర రెవెన్యూ అధికారులు వచ్చి వినతి పత్రాన్ని తీసుకున్నారని, బ్రహ్మనాయుడు ఆవుల ఫారం ప్రాంగణంలోకి వెళ్లకుండా రోడ్డు ప్రక్కన కంచ వెలుపను నుండి మట్టి కుప్పలను తాము చూపామని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తప్పుడు కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. నట్లు, బోల్టులు పోయాయని ఎమ్మెల్యే పెట్టించిన అభియోగం కేసును ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు తప్పుడు కేసులు పెట్టించడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఎమ్మెల్యే సొంత గ్రామం వేల్పూరులో రైతు నరేంద్ర పంటకు మద్దతు ధర కల్పించాలని అడిగినందుకు హత్యాయత్నం కేసు పెట్టించారని దుయ్యబట్టారు. ఒక విలేకరిపైనా ఎస్టీ మహిళతో కేసు పెట్టించారని, సురేష్ మహల్ రోడ్డులో అక్రమంగా నిర్మాణాలను కూల్చివేస్తుంటే అడ్డుకున్న న్యాయవాది మూర్తిపై తప్పుడు కేసు పెట్టించారని అన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు అవినీతిపై పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ భూమిలో మట్టిని తరలించిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వి.పేరయ్య, పి.నాగేశ్వరరావు, గోవిందు నాయక్, జి.విశ్వనాథం, ఆర్.వీరంజనేయరెడ్డి, జి.హనుమంతరావు పాల్గొన్నారు.










