ప్రజాశక్తి-విజయనగరం : ఓటు నమోదు, తొలగింపు ప్రక్రియలో భాగంగా కొంతమంది తప్పుడు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉందని, అలాంటి వాటిపై అధికారులు, కింది స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హెచ్చరించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె పలు అంశాలపై సమీక్షించారు. రాజకీయ లేదా వ్యక్తిగత కారణాలతో కొంతమంది ఉద్దేశపూర్వకంగా వేరే వ్యక్తుల ఓట్లను తొలగించాలని దరఖాస్తులు సమర్పిస్తున్న సంఘటనలు ఇటీవల ఒక జిల్లాలో చోటు చేసుకున్నాయని గుర్తుచేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటివి జిల్లాలో చోటు చేసుకోకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫారం-7 దరఖాస్తులను ఒకటికి రెండు సార్లు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు తేలితే కఠినమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన సంబంధిత లేఖ సారాంశాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అధికారులకు కలెక్టర్ వివరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించి కచ్చితమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికారులు భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఈ ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీల నుంచి సహకారం అవసరమని సూచించారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.డి. అనిత, విజయనగరం ఆర్‌డిఒ ఎం.సూర్యకళ, ప్రత్యేక ఉప కలెక్టర్లు సుదర్శన్ దొర, వెంకటేశ్వరరావు, పద్మలత, ఎఫ్‌ఎస్‌ఒ నూకరాజు, ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.










