
ప్రజాశక్తి - రాజానగరం అర్హత కల్గిన ప్రతీ ఒక్క యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత సూచించారు. మండలంలోని దివాన్‌చెరువు జాతీయ రహదారిపై మంగళవారం ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైట్ కళాశాల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన ద్వారా ఓటు యొక్క విలువను అవగాహన కల్పించారు. ఓటు యొక్క ప్రాధాన్యతను గుర్తించాలంటూ స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రజాస్వామ్యలో ఓటు అనేది చాలా కీలకమని అన్నారు. 2024 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కొరకు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. చనిపోయిన వ్యక్తుల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించుకోవడం కోసం ఫారం 7, చిరునామా నియోజకవర్గల మార్పు కోసం ఫారం 8 ద్వారా ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్, ఆర్‌డిఒలు ఎ.చైత్ర వర్షిణి, ఎస్.మల్లి బాబు, తహశీల్దార్ పవన్ కుమార్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.