
ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హత కల్గిన యువతీ, యువకులు పొందాలని ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు సూచించారు. బుధవారం కొవ్వూరు పట్టణంలో స్వీప్ ఓటరు నమోదు - అవగాహన ర్యాలీలో డిఎస్‌పి వర్మ, మున్సిపల్‌కమిషనర్ బి. శ్రీకాంత్, తహశీల్దార్ బి. నాగరాజు నాయక్, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆర్‌డిఒ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 2024 జనవరి ఒకటి నుంచి 18 ఏళ్ళ వయస్సు కల్గే వారంతా తప్పనిసరిగా ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. చిరునామా మారినా, నియోజక వర్గం మారినా, మరణించినా వాటికి సంబంధించి మార్పులు చేర్పులు చేసేందుకు ఫారం 7, 8 ద్వారా ధరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని వివరించారు. ఓటు హక్కు రాజ్యంగం మనకు కల్పించిన ఆయుధం అని, ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల పాలకులను ఎన్నుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.