రాత్రి వేళ శ్లాబు పెచ్చులూడిన డిగ్రీ కాలేజీ భవనం
శిథిల గదుల్లోనే బిక్కుబిక్కుమంటూ చదువులు
తక్షణ మరమ్మతులకు ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
ప్రజాశక్తి -అరకులోయ రూరల్: శిథిలావస్థకు చేరుకున్న అరకువేలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. పగటిపూట, తరగతులు జరుగుతున్న సమయంలో కాకుండా రాత్రి వేళలో పెద్దస్థాయిలో శ్లాబు పైకప్పు పెచ్చులు కిందపడగా, పెద్దప్రమాదమే తప్పింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో, శిథిలభవనంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని విద్యార్థులు, అధ్యాపకులు భయపడుతున్నారు. భవనానికి తక్షణమే మరమ్మలు చేపట్టడంతోపాటు కొత్త భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు కోరుతున్నారు.
అరకువేలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వసతి లేని పరిస్థితుల్లో పాత భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన ఆ భవనాలు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి శ్లాబ్ పైకప్పు నుంచి భారీ పెచ్చులూడి కిందపడ్డాయి. రాత్రి వేళ కావడంతో పెద్దప్రమాదమే తప్పిందని విద్యార్థులు అంటున్నారు. కాగా గతంలోనూ విద్యార్థులున్న సమయంలోనే చిన్నపాటి పెచ్చులు పడడంతో ఒక విద్యార్థి తతకు తీవ్రగాయాలై ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. గురువారం భారీ స్థాయిలో పెచ్చులు పడిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పదేపదే.ఇటువంటి సంఘటనలు పునరావృతమౌతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంపై పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ కళాశాలలో 1500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, నేతలు, సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, పెచ్చులూడి ప్రాణనష్టం సంభవించకుండా వెంటనే స్పందించాలని కోరుతున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్ కన్వీనర్ కిల్లో ధనలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు కాకరి కొండమ్మ, మండల కమిటీ సభ్యులు సోడాపలి ఐసుబాబు, వంతల బలరాం పాల్గొన్నారు.










