ప్రజాశక్తి - వన్‌టౌన్ : 50వడివిజన్ కొండ ప్రాంతమైన ఆలేటి వారి వీధిలో సోమవారం రాత్రి టపాసులు ఓ పూరిపాకపై పడడంతో అది పూర్తిగా గద్ధమైంది. గృహాోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ పాకలో కూచిపూడి లూదియమ్మ, కూచిపూడి రవికుమార్, పైడిపాటి సరళ నివసిస్తున్నారు. ఎసిపి హనుమంతరావు, సిఐ సుబ్రహ్మణ్యం. శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవిశంకర్, 54 డివిజన్ కార్పొరేటర్ హర్షద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.టూటౌన్ సిఐ సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
బాధితులకు సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు పరామర్శ
ఆదుకోవాలని కమిషనర్‌కు వినతి
సిపిఎం 50 డివిజన్ కార్పొరేటర్, పార్టీ పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు ఘటనా స్థలానికి పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందికి, మున్సిపల్ కమిషనర్‌కు, తహశీల్దారుకు ఆయన ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. స్థానికులు అంటలను అదుపుచేశారు. సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ నిరాశ్రయులైన కుటుంబాలకు ఇళ్లు కేటాయించాలని, తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయాలని కోరారు. అనంతరం విఎంసి కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను సత్యబాబుతోపాటు సిపిఎం మాజీ కార్పొరేటర్ గాదె ఆదిలక్ష్మి, ఐద్వా డివిజన్ కార్యదర్శి వి.స్వప్న కలిసి వినతిపత్రం అందజేశారు.
మాజీ మంత్రి వెలంపల్లి రూ.15 వేల ఆర్థిక సాయం
అగ్ని ప్రమాద బాధితులను మాజీ మంత్రి, పశ్చిమ ఎంఎల్‌ఎ వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం పరామర్శించారు. తక్షణ సాయం కింద రూ.5 వేల చొప్పున అందచేశారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి 50వ డివిజన్ ఇన్చార్జి బంక విజయ, బంక శివ పాల్గొన్నారు.










