
ప్రజాశక్తి-తెనాలి : దీపావళి సందర్భంగా టపాసుల విక్రయంలో కచ్చితమైన నిబంధనలు పాటించాలని సబ్ కలెక్టర్ గీతాంజలిశర్మ అన్నారు. టపాసుల విక్రయానికి షాపుల కేటాయింపు, వ్యాపారులు తీసుకోవాల్సిన టెంపరరీ లైసెన్సులపై అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అగ్నిమాపకం, మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, సేల్స్‌ట్యాక్స్ విభాగాలతో నిర్వహించిన సమీక్షలో షాపులకు అనువైన ప్రాంతాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాపారులు పాటించాల్సిన నిబంధనలపై చర్చించారు. దీపావళి టపాసుల విక్రయానికి వ్యాపారులు కచ్చితంగా లైసెన్సు పొందాలన్నారు. అగ్నిమాపక శాఖ నుంచి నోఅబ్జక్షన్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, నిర్ధేశిత చలానా వంటివి చెల్లించటం ద్వారా టపాసుల విక్రయానికి తాత్కాలిక లైసెన్సు మంజూరు చేస్తారని చెప్పారు. వ్యాపారుల సౌలభ్యం కోసం టెంపరరీ లైసెన్సులు పొందేందుకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సింగిల్ డెస్క్ ఏర్పాటు చేశామని, తాలూకా జూనియర్ కళాశాలతో పాటు పట్టణంలో మరికొన్ని ప్రాంతాలను టపాసుల విక్రయాల షాపుల కేటాయింపుకు పరిశీలించాల్సి ఉందని అన్నారు. పట్టణంతో పాటు కొల్లిపర, మంగళగిరి, తాడేపల్లి, చేబ్రోలు, పొన్నూరులో కూడా షాపుల నిర్వహణకు పరిశీలించి, లైసెన్సులు మంజూరు చేస్తామన్నారు. షాపులకు 50 మీటర్ల లోపు నివాసిత ప్రాంతాలు ఉండకూడదని, షాపుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను వ్యాపారులకు సూచించనట్లు చెప్పారు. సమావేశంలో డీఎస్పీ బి.జనార్ధన రావు, తహశీల్దార్ కె.రవిబాబు, కమిషనర్ ఎం.జస్వంతరావు, పట్టణ ప్రణాళికా విభాగం ఏసిపి2 ఎల్‌ఎస్ సుబ్బారావు, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.