Jun 21,2023 00:34

తెనాలి ప్రాంతంలో వర్షానికి సందడి చేస్తున్న చిన్నారులు

ప్రజాశక్తి-గుంటూరు : తొలకరి చినుకులు జిల్లాను పలకరించాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేసవి తాపం నుంచి గత రెండ్రోజులుగా జిల్లాలో పలు చోట్ల కురుస్తున్న వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. సోమవారం నర్సరావుపేట, వినుకొండలో వర్షాలు పడ్డాయి. మంగళవారం తెనాలి, మంగళగిరిలో భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. గుంటూరు, పెదకూరపాడు, తాడేపల్లి, చేబ్రోలు తదితర మండలాల్లో కొద్దిపాటి జల్లులు పడ్డాయి. గుంటూరులో మంగళవారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రానికి ఒక్కసారిగా మబ్బులు పట్టి, జల్లులు కురవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం రాకతో వాతావణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో రెండు నెలలుగా అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాలులతో అల్లాడుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు సాయంత్రం వేళల్లో కూడా బయటకు రాలేని విధంగా వేడి గాలులతో ఇబ్బంది పడిన నేపథ్యంలో వాతావరణం చల్లబడటంతో పిల్లలు ఆహ్లాదంగా ఆరుబయట ఆడుకున్నారు. రోడ్లపై ప్రజల సంచారం పెరిగింది. రోహిణీ కార్తె వెళ్లి, మృగశిర వచ్చి రెండు వారాలు దాటినా చినుకు జాడలేదు. సుమారు పదిహేను రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపనాలు ప్రవేశించాయి. అక్కడక్కడా ప్రారంభమైన వర్షాలతో ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం అవుతున్న రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇదే ఒరవడి కొనసాగితే జులైలో ఖరీఫ్‌ సీజన్‌ ఊపందుకునే అవకాశం ఉంది.
ప్రజాశక్తి-తెనాలి : 'ఇన్నాళ్లకు గుర్తాచ్చానా వానా' అంటూ చిన్నారులు పట్టణంలో సందడి చేశారు. దాదాపు నెల రోజులుగా వేసవి ఉఫ్ణోగ్రతలు, ఉక్కపోకలతో ఉక్కిరి బిక్కిరైన వారు ఒక్కసారిగా కురిసిన వర్షంలో తడిసి ముద్దయ్యారు. సందడి చేశారు. పట్టణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘావృతమైన ఆకాశం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వర్షించింది. దాదాపు గంట సేపు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
నెల రోజులుగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి విధితమే. రాత్రి పొద్దుపోయినా వాతావరణం చల్లబడలేదు. తెల్లవారుజాము వరకూ వేడి గాలులు వీచాయి. దీంతో కనీసం రాత్రివేళ నిద్రపోలేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు అప్రకటిత విధ్యుత్‌ కోతలు మరింతగా ప్రజలను ఇబ్బందికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో వానలు వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపసమనం కలిగించాయి. భారీ వర్షానికి ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. బోస్‌రోడ్డులో పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి స్వరాజ్‌ థియేటర్‌ వరకు, చినరావూరు పార్కు రావిచెట్టు నుంచి స్టేషన్‌ రోడ్డు మలుపు వరకూ, కొత్తపేటలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదురు రోడ్డు, బుర్రిపాలెం రోడ్డులో జండా చెట్టు వరకూ రోడ్డుపై వర్షపునీరు భారీగా చేరింది. ద్విచక్ర వాహనాలు దాదాపుగా సగానికి పైగా మునిగిపోయాయి. దీంతో ఎక్కడి వాహనదారులు అక్కడే నిలిచాయి. వర్షం ద్వారా వచ్చిన చల్లదనాన్ని ఆశ్వాదించారు. మరోవైపు చిన్నారులైతే కొన్ని చోట్ల వర్షంలో తడిస్తూ కేరింతలు కొట్టారు. సంతోషంగా చిందులు వేశారు. ఇదిలా ఉంటే ఖరీఫ్‌లో పొలం దుక్కి దున్నేందుకు ఆశగా ఎదురు చూస్తున్న రైతాంగానికి ఈ వర్షం ఎంతో ఉపయోగకరమని రైతులు అంటున్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : మంగళగిరి పట్టణంలో మంగళవారం వడగండ్ల వానతో భారీ వర్షం పడింది. ఈదురు గాలితో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులకు చెట్లు విరిగి కరెంటు స్తంభాలు పై పడ్డాయి. రత్నాల చెరువు, కూప్పురావు కాలనీలో చెట్లు విరిగాయి. వేగంగా వీచిన గాలులకు ఆటోలు ద్విచక్ర వాహనాలు పడిపోయినవి. కొన్ని ప్రాంతాల్లో కరెంటు అంతరాయం కలిగింది.
ప్రజాశక్తి - పెదకూరపాడు : భానుడి భగభగలతో మలమల మాడిన వద్ధులు పిల్లలు వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల నుంచి చిరుజల్లులతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 29వేల ఎకరాలు సాగుభూమి ఉంది. ఈ వర్షంతో వ్యవసాయ పనులకు రైతులు సిద్ధమవుతున్నారు. జూన్‌ నెలలో మండలంలో 95 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా సోమవారం 8.2 మిట్లీమీటర్లు కురిసింది. మంగళవారమూ వర్షం కొనసాగింది. గతేడాది జూన్‌లో ఏడు రోజులపాటు 49.4 మిల్లీమీటర్లే నమోదైంది. గత జూన్‌ నెలలో ఆరవ తేదీన నాలుగు మిల్లీమీటర్లు, 13వ తేదీన 11.2, 22వ తేదీన 7.2, 23వ తేదీన 3.8, 27వ తేదీన 18.8 , 28వ తేదీన 1.4, 29వ తేదీన 6.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గతేడాది జూన్‌ 10వ తేదీన, 13వ తేదీలలో పత్తి విత్తనాలు నాటారు. ముఖ్యంగా గారపాడు, హుస్సేనగరం, లింగంగుంట్ల, ఖమ్మంపాడు, తదితర గ్రామాల్లోని గరువు భూములు, ఎర్ర నేలలలో వేసే రైతులు సాగు చేశారు. వరుసగా మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే గొర్రు తోలకం, గుంట తోలకం ఆ తర్వాత అచ్చు ద్వారా విత్తనాలు వేస్తారు. పచ్చిరొట్ట విత్తనాలు ఎదబెట్టడానికి కూడా ఆలస్యమైంది. పదును తర్వాతే ప్రత్తి విత్తనాలు విత్తుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి శాంతి సూచించారు. హడావుడిగా విత్తనాలు వేసి నష్టపోయే పరిస్థితి తెచ్చుకోకూడదన్నారు.