ప్రజాశక్తి- గోపాలపట్నం : ట్రాఫిక్ నిబంధనల పేరుతో తోపుడు బండి కార్మికులకు పోలీసులు తీవ్ర అన్యాయం చేశారని, వారి ఉపాధిని పోగొట్టారని సిపిఎం గోపాలపట్నం జోన్ కమిటీ కార్యదర్శి బలివాడ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. గోపాలపట్నంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందస్తు సమాచారం లేకుండా ఈ నెల 14వ తేదీన సుమారు 150 మంది తోపుడు బళ్ల కార్మికులను బిఆర్‌టిఎస్ రోడ్డు పక్కన వ్యాపారం చేయకుండా అడ్డుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా 6 కోట్ల చిల్లర వర్తకులు ఉన్నారని, వారికి జన సమర్థ ప్రదేశంలో స్థలం సేకరించి షాపులు నిర్మించి ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపిందని చెప్పారు. వీరికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి, వ్యాపార అభివృద్ధికి సహకరించాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. బిఆర్‌టిఎస్ రోడ్డులో తోపుడు బళ్ల కార్మికుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నది వాస్తవం కాదన్నారు. ట్రాఫిక్ పోలీసులు సరిగ్గా విధులు నిర్వహించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ పోలీసుల చర్యలు వల్ల తోపుడు బళ్ల కార్మికులు అమ్మకానికి తెచ్చిన పండ్లు పాడైపోయి ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యథావిధిగా వారు వ్యాపారం జరుపుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికుల సంఘం అధ్యక్షుడు జి.మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి జగదీశ్వరరావు, ఇతర కార్మికులు పాల్గొన్నారు.










