Aug 21,2023 23:35

టోల్‌గేట్‌ వద్ద ధర్నా చేస్తున్న సిపిఎం, సిపిఐ నాయకులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : అక్రమంగా నడుస్తున్న అగనంపూడి టోల్‌గేట్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌చేస్తూ టోల్‌గేట్‌ వద్ద సిపిఎం, సిపిఐ అధ్యర్యాన సోమవారం ధర్నా నిర్వహించారు. సిపిఎం స్టీల్‌ జోన్‌ కార్యదర్శి పివిఎస్‌బి శ్రీనివాసరాజు, సిపిఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ధర్నానుద్దేశించి జివిఎంసి 78 వార్డు సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ, చట్టవ్యతిరేకంగా నడుస్తున్న అగనంపూడి టోల్‌గేట్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. జివిఎంసి పరిధిలో టోల్‌గేట్‌ ఉండకూడదని చట్టం ఉండి, టోల్‌గేట్‌ను ఎత్తి వేయాలని జివిఎంసి తీర్మానం చేసినా దాన్ని కొనసాగిస్తూ ప్రజలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దోపిడీ చేస్తోందని విమర్శించారు. తాము సుప్రీంకోర్టులో వేసిన కేసు హియంరింగ్‌కు వచ్చినా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. టోల్‌గేట్‌ను వెంటనే ఎత్తివేయకపోతే ప్రజలను సమీకరించి తామే దాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ, ఈ టోల్‌గేట్‌ను ఎత్తివేయాడానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడాన్ని చూస్తే టోల్‌గేట్‌ యాజమాన్యంతో లాలూచీ పడుతోందని అర్థమవుతోందన్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వారి వ్యాపారాలు, వ్యవహారాల పట్ల ఉన్న శ్రద్ద టోల్‌గేట్‌ సమస్యపై చూపడం లేదన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ సమస్యపై ప్రేక్షక పాత్ర పోషిస్తోందని విమర్శించారు. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆరులైన్ల రోడ్డు పూర్తయిన వెంటనే ఈ టోల్‌గేట్‌ ఎత్తివేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపిందని, ఆరు లైన్ల హైవే పూర్తయినా నేటికీ ఎత్తివేయకపోవడం దుర్మార్గమన్నారు. ఈ ధర్నాలో సిపిఎం స్టీల్‌జోన్‌ నాయకులు మరిడయ్య, అయోధ్యరామ్‌, రామస్వామి, ఎన్‌.రామారావు, సిపిఐ నాయకులు రెహమాన్‌, అగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ బలిరెడ్డి సత్యనారాయణ, ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ నాయకులు శ్రీనివాసరావు, శనివాడ కాలనీ అసోసియేషన్‌ నాయకులు సిహెచ్‌.నారాయణరావు, రామకృష్ణ ప్రసంగించారు. ధర్నాలో వందలాది మంది పాల్గొన్నారు.