Nov 09,2023 21:48

బోడికొండ చుట్టూ మట్టి తవ్వుతున్న అక్రమణ దారులు

మక్కువ : భూగర్భగనుల శాఖ లీజుదారు నుండి తీసుకున్న రవాణా రసీదులనే అనుమతి పత్రాలుగా చూపిస్తూ అక్రమంగా కంకర తరలించుకుపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మండలం నుంచి వేరొక మండలానికి ప్రధాన రహదారి గుండా దర్జాగా కంకర తీసుకుపోతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వివరాల్లోనికి వెళ్తే...
మండలంలోని కాశీపట్నం పరిధిలోని సర్వేనెంబర్‌ 91లో ఉన్న బోడిమెట్ట పరిధిలో మూడు రోజులుగా కంకర తవ్వకాలు జరుగుతున్నాయి ఇక్కడి నుండి సీతానగరం మండలం తామరకండి నుండి బక్కుపేటకు వెళ్లే నూతన రహదారికి కంకర తరలిస్తున్నారు. మన్యం జిల్లాకు సంబంధించి గనులను చూస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్‌ సంస్థ నుండి సుమారు 1000 క్యూబిక్‌ మీటర్లకు రవాణా రసీదులను సంబంధిత కాంట్రాక్టర్‌ పొందారు. అయితే ఈ రసీదులనే అనుమతి పత్రాలుగా చూపుతూ కంకర తరలించకపోతున్నారు. కంకర తవ్వకాలకు సంబంధించి అనుమతులున్న చోట నుండే తీసుకువెళ్లాలని రవాణా రసీదులు ఇచ్చినట్లు రాఘవ కన్స్ట్రక్షన్స్‌ ప్రతినిధి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాము ఎలాంటి అనుమతి పత్రాలు ఇవ్వలేదని ఆయన విలేకరులకు తెలిపారు.
ఏ విధమైన అనుమతులు ఇవ్వలేదు
బోడుమెట్ట పరిధిలోని కంకర తవ్వకాలకు ఎవరికి అనుమతులు ఇవ్వలేదని తహశీల్దార్‌ సూర్యనారాయణ అన్నారు. అలాగే తవ్వకాలు జరుపుతున్నట్లుగానే మైనింగ్‌ శాఖ అధికారులు కూడా తమకు సమాచారం ఇవ్వలేదని ఆయన అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహశీల్దార్‌ తెలిపారు.
పట్టుకున్నారు... వదిలేశారు
బోడిమెట్ట పరిధిలోని అక్రమ తవ్వకాలు దందా యథేచ్ఛగానే కొనసాగుతూ వస్తుంది. గతంలో ప్రైవేట్‌ లేఔట్ల కోసం గ్రావెల్‌ తవ్వుతుండగా మైనింగ్‌ అధికారులు పట్టుకున్నారు. అపరాధ రుసుం వసూలు చేసి విడిచిపెట్టారు. ఇంత జరిగినా ఏ విధమైన అనుమతులు లేకుండా దొంగచాటు తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. దీనిపై అధికారులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇతర మండలాలకు సైతం ఇక్కడ కంకర ఏ విధమైన పర్మిట్లు లేకుండానే తరలించుకపోతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తు న్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.