Jul 12,2023 23:30

శిబిరంలో నినాదాలు చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి -గాజువాక : ఆదాని గంగవరం పోర్టు యాజమాన్యం మొండివైఖరికి నిరసనగా నిర్వాసిత కార్మికులు చేపడుతున్న నిరవధిక నిరసనలు బుధవారం తొమ్మిదో రోజుకు చేరాయి. పెదగంట్యాడ గాంధీ జంక్షన్‌ వద్ద చేపడుతున్న దీక్షలకు స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టర్‌ లేబర్‌ యూనియన్‌, సిఐటియు ప్రతినిధులు సంఘీభావం ప్రకటించి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టీల్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి శ్రీనివాస్‌, నమ్మి రమణ మాట్లాడుతూ, గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. గంగవరం పోర్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన నిర్వాసిత కార్మికులు జీతాలు పెంచమంటే, యాజమాన్యం నిర్లక్ష్యంగా కార్మికులను ఉద్యోగాలు తొలగించడం దారుణమన్నారు. ఇప్పటికైనా పోర్టు యాజమాన్యం దిగొచ్చి, సంప్రదింపులతో సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేసేందుక తాము ప్రత్యక్షంగా పాల్గొంటామని హెచ్చరించారు.
గంగవరం పోర్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి నొల్లి తాతారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండ చూసుకొని గంగవరం పోర్టు యాజమాన్యం కార్మికులు పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, పలు నోటీసులు పంపి, భయపెడుతోందన్నారు.నిర్వాసిత కార్మికులకు రూ.22వేలు బేసిక్‌తో కనీస వేతనం రూ.32వేలు అమలు, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవడం, ఇతర సమస్యలను పరిష్కరించకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు పులి రమణారెడ్డి, సిఐటియు స్టీల్‌జోన్‌ ప్రధాన కార్యదర్శి కొవిరి అప్పలరాజు, సిపిఐ నాయకులు పల్లెటి పోలయ్య, నాయకులు కణిత అప్పలరాజు, పాల వెంకయ్య దీక్షాశిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు వాసుపిళ్లి ఎల్లాజీ, గంటిపిల్లి అమ్మోరు, మాద అప్పారావు, పేర్ల నూకరాజు, కదిరి సత్యానందం, గంటిపిల్లి లక్ష్మయ్య, కొవిరి అమ్మోరు పాల్గొన్నారు
హెచ్‌పిసిఎల్‌, స్టీల్‌ సిఐటియు మద్దతు
ప్రజాశక్తి -ములగాడ: అదానీ గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు న్యాయమైన పొరాటానికి మద్దతుగా బుధవారం హెచ్‌పిసియల్‌ కల్యాణి గేట్‌ వద్ద సిఐటియు మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆందోళనకు అధ్యక్షత వహించిన సిఐటియు జోన్‌ అధ్యక్షులు కె.పెంటారావు మాట్లాడుతూ,కార్మికుల పట్ల గంగవరం పోర్టు యాజమాన్యం మొండివైఖరి విడనాడి, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. జోన్‌ ప్రధానకార్యదర్శి, హెచ్‌పిసిఎల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఆర్‌.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, కనీస వేతనాలు కోసం పోరాడుతున్న ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం చట్టవిరుద్ధమన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ సూచనలు సైతం బేఖాతరు చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోర్టు యజమాని అదానిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో హెచ్‌పిసిఎల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి జి.నరేష్‌, డి.రాజేష్‌, బాలరాజు, ప్రేమ్‌, మహేంద్ర, విష్ణు, శ్రీను, సురేష్‌, ఎస్‌.నాగేంద్ర, వెంకటేష్‌, కుమార్‌ పాల్గొన్నారు.
ఉక్కునగరం : అదాని గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికుల పోరాటానికి స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ సిఐటియు నేతలు సంఘీభావం తెలిపారు. పెదగంట్యాడ గాంధీ విగ్రహం వద్ద దీక్షశిబిరం వద్ద యూనియన్‌ అధ్యక్షుడు జి శ్రీనివాసరావు, ఉప ప్రధాన కార్యదర్శి. పి మసేను. నాయకులు. పి వరహాలు, పి నారాయణ, ఎన్‌.కృష్ణ, అంకంరెడ్డి శ్రీను, నమ్మి చంద్రరావు. శ్యామ్‌, శశిభూషణ్‌ వెళ్లి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.