Jul 13,2023 21:56

మాట్లాడుతున్న టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : తమపై ఆరోపణలు చేసే ముందు కురుపాం ఎమ్మెల్యేగా పుష్పశ్రీవాణి తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమిటో తెలపాలని టిడిపి కురుపాం నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి ప్రశ్నించారు. టిడిపిది బస్సు యాత్ర కాదు.. తుస్సుయాత్ర అన్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి వ్యాఖ్యలకు కౌంటర్‌గా చినమేరంగికోటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపి నిర్వహించిన బస్సు యాత్రకు భారీ సంఖ్యలో వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలను చూసి ఓర్వలేక ఓటమి భయంతో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ కాలం వెళ్లదీసే కన్నా అభివృద్ధి దృష్టి సారిస్తే బాగుంటుందని హితవుపలికారు. ఎమ్మెల్యే తొమ్మిదేళ్ల పాలనలో నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని అన్నారు. గడపగడపకు వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యేకు ఎదురవుతున్న అవమానాలు చూస్తే అభివృద్ధి ఏ మేరకు జరిగిందో అర్థమవుతోందని ఎద్దేవాచేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కురుపాం పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రాంత సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చొరవ చూపలేదని ఆక్షేపించారు. మారుమూల గ్రామాలకు రోడ్లు లేక గిరిజనులు డోలీల సాయంతో వైద్యం కోసం వస్తున్న దృశ్యాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నాడు-నేడు పనులు పాఠశాలల్లో ఏ మేరకు పూర్తయ్యాయో పరిశీలించాలన్నారు. గిరిజనులు, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం టిడిపి అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ మాట్లాడుతూ చినమేరంగి గ్రామంలో గడపగడపకు నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. 13, 14, 15 ఆర్థిక సంఘం నిధులతో సిసి రోడ్లు, కాలువలు, పారిశుధ్య పనులు చేపట్టకుండా దారిమళ్లించారని చెప్పారు. అభివృద్ధిని పక్కనపెట్టి ఆస్తులే ఎక్కువగా సంపాదించుకున్నారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో నూటికి నూరు శాతం పుష్పశ్రీవాణి ఓటమి ఖాయమన్నారు. సమావేశంలో టిడిపి మండల కన్వీనర్లు పాడి సుదర్శన్‌రావు, అక్కేన మధుసూదన్‌ రావు, కొండయ్య, నాయకులు కోలా రంజిత్‌ కుమార్‌, నందివాడ కృష్ణబాబు, పురుషోత్తంనాయుడు, విజయంకుశం తదితరులు పాల్గొన్నారు.