ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
భారత సమాజంలో చచ్చిన పశువుల చర్మంతో వస్తువులు సృష్టించిన తొలితరం శాస్త్రవేత్తలు చర్మకారులని, అలాంటి చర్మకారుల బతుకుకు భరోసా కల్పించకపోతే ఎగిసే కెరటాల్లాగా ఉద్యమమై ఎగసి వస్తామని చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎమ్‌డి.ఆనంద్‌బాబు హెచ్చరించారు. శనివారం ఎమ్మిగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ చర్మకార వృత్తిదారుల సంఘం కర్నూలు జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. ముందుగా ఎస్సీ కాలనీ ఎమ్‌బి చర్చి దగ్గరి నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి తేరుబజార్ మీదుగా పద్మశాలి కల్యాణ మండపం వరకు ప్రదర్శన నిర్వహించారు. సంఘం జెండా ఆవిష్కరణ చేపట్టారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు హెచ్.జయరాజు అధ్యక్షతన జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్.రాధాకృష్ణ, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్.దేవసహాయం, ఆనంద్‌బాబు మాట్లాడారు. మానవ సమాజ అభివృద్ధి క్రమంలో కుండ, బట్ట లేని కాలంలోనే నీటిని నిల్వ చేసే తోలుతిత్తిని కుట్టి సమాజానికందించిన తొలితరం శాస్త్రవేత్త చర్మకారుడన్నారు. మెడగంటలు, వారలు, బెల్టులు, బ్యాగులు, నీటి బొక్కెన, అరిగోలు కింది పట్టా, కొలిమి గాలితిత్తి, చెప్పులు లాంటి ఎన్నో సమాజానికి అవసరమైన వస్తువులు సృష్టించారని తెలిపారు. కానీ సమాజం అధమ వృత్తి పేరుతో అంటగట్టబడిన ఈ వృత్తి కారణంగా బతుకు భద్రత లేక, నేటికీ చినిగిన గొడుగు, పాతబడిన బ్యానర్, చెట్టు, గోడ దాపులే వృత్తి కేంద్రాలుగా దుమ్ముకు, దూళికి అనారోగ్యాలకు గురవుతూ వృత్తిని కొనసాగిస్తున్నారని చెప్పారు. సంఘం పోరాట ఫలితంగా పింఛన్‌ను సాధించుకున్నామని, ఆ పింఛను రూ.5 వేలకు పెంచాలని కోరారు. పింఛనుతోపాటు సాధించుకున్న రూ.20 వేల విలువ చేసే పనిముట్లు నేటికీ ఇవ్వలేదన్నారు. వీటితో పాటు రెండెకరాల భూమి, ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని భవిష్యత్తులో నిర్వహించే పోరాటంలో భాగస్వామ్యం కావాలని కోరారు. చర్మకార వృత్తిదారుల సంఘం నాయకులు ఆంథోని, భాస్కర్, రాజు, కాలేబు, గుంటెప్ప, కెవిపిఎస్ జిల్లా నాయకులు విజయమ్మ, కరుణాకర్, కృష్ణ, తిక్కప్ప, గురుస్వామి, రమేష్, భాస్కర్, మారయ్య, మామిడికాయల రాజు, ఆనందరాజు, హనుమంతు, వెంకటేష్, చక్రపాణి తదితరులు పాల్గొని మాట్లాడారు. మరో 300 మంది చర్మకారులు మహాసభలో పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఆనంద్‌బాబు










