భారత తొలితరం పర్యావరణవేత్త సుందర్‌లాల్ బహుగుణ.. 1927 జనవరి 9న ఉత్తరాఖండ్‌లోని తెహ్రీగర్వాల్ జిల్లా మరోడా గ్రామంలో జన్మించారు. ఆయన 2021, మే 21వ తేదీన మనకు భౌతికంగా దూరమయ్యారు. ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం.
బహుగుణ బాల్యం...
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో 1927లో బహుగుణ జన్మించారు. పచ్చని పచ్చిక బయళ్లు, దేవదారు వృక్షాల నడుమ ఆయన పెరిగారు. వివాదాలు, ఘర్షణలకు దూరంగా ఉండే బహుగుణ చాలా మృదు స్వభావి. ఎంతో హుందాగా నడుచుకునేవారు. హిమాలయ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడానికి, చెట్ల నరికివేతకు సంబంధముందని తొలినాళ్లలో చెప్పినవారిలో ఆయన కూడా ఒకరు. మట్టి మనిషిగా బహుగుణ చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ప్రకృతిని కాపాడేందుకు ఆయన జీవితాంతం కృషి చేశారు.
సుందర్‌లాల్ బహుగుణ 13 ఏళ్ల వయసులోనే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, జైలుకెళ్లారు. అనంతరం రాజకీయాలవైపు ఆకర్షితులైనా 1949లో ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మీరాబెన్, థక్కర్ బాపాలను కలవడంతో ఆయన జీవితం మలుపు తిరిగింది. వారి స్ఫూర్తితో సామాజిక కార్యకర్తగా మారి కుల వ్యవస్థపై పోరాటం చేశారు. ఆచార్య వినోబా భావే పిలుపుతో 1960లో ఏడు జిల్లాల్లో పాదయాత్ర చేశారు. ఈ సమయంలో సుందర్‌లాల్ బహుగుణకు పర్యావరణ సమస్యలపై ఒక అవగాహన ఏర్పడింది. దీంతో హిమాలయ పాద ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు ఆయన నడుం బిగించారు. ఆ క్రమంలోనే ''చిప్కో'' ఉద్యమాన్ని ప్రారంభించారు. అటవీ కాంట్రాక్టర్ల నుంచి చెట్లను కాపాడడానికి స్థానిక మహిళలతో ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ''చిప్కో'' అంటే ఆలింగనం చేసుకోవడం అని అర్థం. కాంట్రాక్టర్లు చెట్ల నరికివేతకు వచ్చినప్పుడు స్థానిక మహిళలంతా చెట్టు చుట్టూ మానవహారంగా ఏర్పడి అడ్డుకునేవారు.
చిప్‌కో ఉద్యమం..
వాస్తవానికి ''చిప్కో'' ఉద్యమాన్ని సుందర్‌లాల్ బహుగుణ కంటే ముందు ఎన్నో ఏళ్ల క్రితమే బిష్ణోరు గిరిజన తెగలు చేపట్టాయి. అయితే, ఆ ఉద్యమం గురించి ప్రపంచం మొత్తానికీ తెలిసేలా చేసింది మాత్రం బహుగుణ. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించేందుకు 1973లో 120 రోజులపాటు 1400 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అలాగే, 1975లో 2,800 కిలోమీటర్లు.. 1981-83 మధ్య కాశ్మీర్ నుంచి కోహిమా దాకా 3,870 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
''చిప్కో'' ఉద్యమ మార్గదర్శిగా సుందర్‌లాల్ బహుగుణ చరిత్రలో చెరిగిపోని ముద్ర వేశారు. అడవుల సంరక్షణకు గౌరీదేవి వంటి ప్రముఖ పర్యావరణ ఉద్యమకారులతో కలిసి ''చిప్కో'' ఉద్యమాన్ని ఉధృతంగా నడిపారు. 1973లో హిమాలయ పర్వత పాదాల వద్ద ఆయన మొదలుపెట్టిన ఉద్యమం.. తర్వాత కాలంలో దేశం మొత్తానికీ విస్తరించింది. ''పర్యావరణమే శాశ్వత ఆర్థికవ్యవస్థ'' అనే సూత్రాన్ని విశ్వసించిన సుందర్‌లాల్ బహుగుణ.. దాన్నే ''చిప్కో'' ఉద్యమ నినాదంగా మార్చి, జీవితాంతం అందుకోసమే కృషి చేశారు.
అంతర్జాతీయ దృష్టికి..
బహుగుణ పిలుపుపై తోటి ఉద్యమకారుడు చండీ ప్రసాద్ భట్‌తో చాలామంది హిమాలయాల్లోని చెట్లను ఆలింగనం చేసుకున్నారు. ఎవ్వరూ చెట్లను కొట్టేయకుండా మానవహారాలు కట్టారు. ''ఈ చెట్లు మాలో భాగమే'' అనే గట్టి సందేశాన్ని ప్రజల్లోకి ఈ ఉద్యమం తీసుకెళ్లింది. 1970ల్లో ఉత్తరాఖండ్‌లో విధ్వంసకర వరదలు ముంచెత్తడంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు. ''చెట్ల నరికివేత, వరదలు, కొండ చరియలు విరిగిపడం మధ్య లంకెను వారు తెలుసుకున్నారు'' అని ''చిప్కో'' ఉద్యమం గురించి ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రాశారు.
ఈ వరదలకు మూడేళ్ల తర్వాత, బహుగుణతో సహా, ఆయన అనుచరులు చెట్లను ఆలింగనం చేసుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది యువకులు అయితే, ప్రకృతిని పరిరక్షిస్తామని రక్తంతో ప్రతినబూనారు. ఆ తర్వాత మహిళలు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యారు. చెట్లను హత్తుకోవడమే కాకుండా, వాటికి రాఖీలు కూడా కట్టారు. మంచులో నడుచుకుంటూ వెళ్లి, చెట్లను కొట్టేవారి నుంచి పనిముట్లను లాగేసుకునేవారు.
హిమాలయాల్లో పెరిగిన బహుగుణ ఈ ఉద్యమానికి చక్కని నాయకత్వం అందించారు. చెట్ల నరికివేతతో నేల కోతకు గురవుతుందని, దీంతో అన్నింటినీ కోల్పోయి, పట్టణాలకు పురుషులు వలస వెళ్లాల్సి ఉంటుందని బహుగుణ హెచ్చరించారు. దీంతో వంట చెరకు తేవడం నుంచి నీళ్లు మోసుకోవడం, వ్యవసాయం.. ఇలా అన్ని బాధ్యతలూ మహిళలపై పడతాయని బహుగుణ అన్నారు. మహిళా హక్కుల ఉద్యమాల్లో ఈ ఉద్యమం ఒక మైలురాయిలా నిలిచింది. ఏళ్లు గడిచేకొద్దీ, ఈ ఉద్యమం మరింత బలపడింది. పెద్దయెత్తున కాలేజీ విద్యార్థులు, మహిళలు దీనిలో చేరారు. వీరు శ ాంతియుత ప్రదర్శనలు, దీక్షలు చెపడుతూ.. చెట్లను ఆలింగనం చేసుకునేవారు.
ఈ ఉద్యమం 1981లో ఫలించింది. ఉత్తరాఖండ్‌లో వాణిజ్య అవసరాల కోసం చెట్లను కొట్టేయకుండా ప్రభుత్వం 15 ఏళ్ల నిషేధం విధించింది. రెండేళ్ల తర్వాత, హిమాలయాల్లో పర్యావరణ విధ్వంసం గురించి అందరికీ తెలియజేసేందుకు బహుగుణ నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
తెహ్రీడ్యాం నిర్వాసితుల కోసం...
1992లో భారత్‌లో అత్యంత పొడవైన తెహ్రీ డ్యాం ముందు బహుగుణ గుండు కొట్టించుకొని, నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఆనకట్ట వల్ల తమ ఇళ్లను కోల్పోయినవారిలో బహుగుణ కూడా ఒకరు. అటవీ అధికారులు, ప్రైవేటు కాంట్రాక్టర్లకు పర్యావరణ విధ్వంసంపై ఆయన హితబోధ చేసేవారు. బహుగుణ ఉద్యమం గురించి ఓ ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ప్రశ్నించినప్పుడు.. ''నిజానికి, ఈ ఉద్యమ లక్ష్యాల గురించి నాకు తెలియదు. ఒకవేళ చెట్లను నరికివేయకుండా అడ్డుకోవడమే వీరి లక్ష్యం అయితే, నేను కూడా వారి వెంట నిలబడతాను'' అని ఆమె చెప్పారు.
ఏళ్లు గడిచినప్పటికీ బహుగుణ ఇచ్చిన సందేశం ఇప్పటికీ మనకు కనిపిస్తుంటుంది. 2017లో ముంబయిలో మెట్రో రైలు కోసం చెట్లు నరికేయకుండా చాలామంది చెట్లను ఆలింగనం చేసుకున్నారు. బహుగుణ గాంధేయవాది. చిన్న ఆశ్రమంలో ఆయన జీవించేవారు. హింసను ఆయన త్యజించారు. ఆయన ఉద్యమాలకు రాజకీయాలతో సంబంధం లేదు. భారత్ ఇంధన అవసరాల కోసం మానవ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలని.. సౌర, పవన, జల విద్యుత్‌ను ఉపయోగించాలని ఆయన సూచించారు. తక్కువ విద్యుత్ ఉపయోగించుకునేలా మెషీన్లను మెరుగుపరచుకోవాలని అన్నారు.