ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన స్థలాల్లో ఇప్పటివరకు నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదని సిపిఎం ప్రశ్నించింది. రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చిన భూముల్లో 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 208 ఎకరాలు, 18 ప్రభుత్వ రంగ శాఖలకు 27 ఎకరాలను టిడిపి ప్రభుత్వ హయాంలో స్థలాలను కేటాయించడం జరిగిందని, ఇప్పటివరకు నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదో బిజెపి నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. తుళ్లూరు ప్రాంతంలో తొలితరం కమ్యూనిస్టు నాయకులు అమరజీవి నెలకుదుటి నాగేశ్వరరావు 78వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన స్వగ్రామం దొండపాడులో శనివారం రాత్రి వర్ధంతి సభ నిర్వహించారు. సభలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి మాట్లాడుతూ నెలకుదిటి నాగేశ్వరరావు జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. గుంటూరు తాలూకా రైతు సంఘం అధ్యక్షుడిగా, టుబాకో బోర్డు మార్కెటింగ్ కమిటీ సభ్యుడిగా, తాలూకా ప్రజా ఆహార కమిటీకి కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించిన ఆదర్శ కమ్యూనిస్టు నాగేశ్వరరావని కొనియాడారు. జాతీయ ఉద్యమంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నిలిచి ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించారని, గుంటూరు జిల్లాలో ఎనలేని గౌరవం పొందిన కమ్యూనిస్టు నేతని శ్లాఘించారు. నిద్రాహారాలు మాని ఊరూరూ తిరిగి యువజనలను, రైతులను,రైతు కూలీలను సంఘటితం చేశారని, అస్పృశ్యతను ప్రతిఘటించారని తెలిపారు. తనకున్న నాలుగెకరాల పొలాన్ని పార్టీకే ఇచ్చారని కొనియాడారు. తుది శ్వాసవిడిచే ముందు తన కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకొని తన చేతిలో చేయి వేయించుకొని కమ్యూనిస్టు పార్టీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించుకున్నారని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు పునరంకితం అవుదామన్నారు. అనంతరం రాజకీయాలపై మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి తోడు దొంగల్లా వ్యవహరిస్తూ ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి విషయంలో బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇప్పటివరకు రాజధాని అమరావతికి నిధులు కేటాయించకుండా మొండి చెయ్యి చూపిందన్నారు. రాజధానిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నిర్మాణాలు చేపట్టకుండా ఎవరైనా అడ్డుకున్నారా..? అని నిలదీశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం లాంటి ప్రజాపయోగ ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. తొలుత స్మారక స్తూపం వద్ద సిపిఎం జెండా ఎగురవేశారు. కార్యమ్రకంలో నాయకులు ఎం.భాగ్యరాజు, వి.వెంకటేశ్వ రరావు, ఎం.గిరిజ, ఎన్.వెంకటేశ్వరరావు, కె.రామారావు, ఎం.హరిబాబు, ఎన్.శ్రీనివాసరావు, జి.బుల్లిబాబు, బి.వెంకటేశ్వరరావు, పి.శ్రీనివాసరావు, ఎన్.గోపాలరావు, కె.ఆంజనేయులు, ఎన్.శ్రీరామమూర్తి, జానీ, రాములు, కృష్ణారావు, పి.వెంకటేష్, జి.లోకయ్య పాల్గొన్నారు.










