ప్రజాశక్తి-విజయవాడ: నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ (ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టిడి) సంస్థకు చెందిన తొలితరం అల్బియాన్ (డెక్కన్ క్వీన్) పాసింజర్ బస్సును సిటీ బస్ టెర్మినల్ వద్ద టిఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న, ఆర్టీసి ఎండి సిహెచ్ ద్వారకా తిరుమలరావు, విజయవాడ డిపోలో పని చేసి రిటైరైన్ ఇద్దరు సీనియర్ డ్రైవర్లు బుధవారం ఆవిష్కరించారు. అప్పటి వారి అనుభవాలను, ఈ బస్సు తాలూకా జ్ఞాపకాలను వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులు బస్సు లోపలి సీటింగ్ అమరికను, కిటికీ నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ విజయవాడ బస్‌స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులందరికీ ఈ పురాతన బస్సు కనబడేలా సిటీ పోర్టులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆనాటి నిజాం యువరాణి జహీరా బేగం ప్రయాణికుల కోసం ఈ బస్సును సొంత ఖర్చులతో కొనుగోలు చేయడం వల్ల ఆమె పేరులోని మొదటి అక్షరంని ఇప్పటికీ ప్రభుత్వ బస్సుల రిజిస్ట్రేషన్‌గా చేశారని తెలిపారు. ప్రద్యుమ్న మాట్లాడుతూ ఆర్టీసి తొలితరం బస్సును ఇప్పటి వారందరికీ తెలియజేసేలా ప్రదర్శనకు ఉంచడం కొనియాడదగినదని కితాబిచ్చారు.










