
ప్రజాశక్తి-వన్‌టౌన్: దసరా నవరాత్రుల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ చరిత్రలోనే తొలిసారిగా మహాచండీ దేవి అలంకారంలో దుర్గమ్మ యాత్రికులకు దర్శనమిచ్చింది. అధిక శ్రవణం, తిథి హెచ్చుతగ్గులు తేడా వల్లే అమ్మవారి అలంకారంలో మార్పులు చేసినట్లు ఆలయ నిర్వాహుకులు తెలిపారు. ఐదో రోజు గురువారం ఉదయం మూడు గంటల నుంచే మహాచండీ దర్శనం కోసం యాత్రికులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దాదాపు 70 సంవత్సరాల తరువాత దేవస్థానం అధికారులు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనానికి ఏర్పాట్లు చేయటంతో యాత్రికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గురువారం సుమారు లక్ష మందికి పైగా యాత్రికులు దుర్గమ్మను దర్శించుకున్నట్లు దేవస్థాన అధికారులు అంచనా వేస్తున్నారు. వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్లలో వస్తున్న యాత్రికులకు దారి పొడవునా మంచినీరు, పసి పిల్లలకు వేడి పాలు స్వచ్ఛంద కార్యకర్తలు అందించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, సిపి కాంతిరాణా టాటా, ఇఒ కె.ఎస్.రామరావు, చైర్మన్ కర్నాటి రాంబాబ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహా చండీదేవిగా అలంకారం ఉన్న దుర్గమ్మను కేంద్ర మంత్రి నారాయణస్వామి, రాష్ట్ర డిప్యూటీ సిఎం రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ విఫ్ సామినేని ఉదయభాను, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, శివస్వామి, ఏసిబి కోర్టు జడ్జి, దేవాదాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, సినీ నటి మెహరిన్, దుర్గగుడి పూర్వ ఇఓలు సూర్యకుమారి, కోటేశ్వరమ్మ దర్శించకున్నారు.
ఆదాయం రూ.35 లక్షలు
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు గురువారం వివిధ టిక్కెట్ల ద్వారా రూ.35,16,024 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రామారావు తెలిపారు. రూ.500 టికెట్ల ద్వారా రూ.15 లక్షలు, రూ.300 టిక్కెట్లు ద్వారా రూ 4.35 లక్షలు, రూ.100 టిక్కెట్ల ద్వారా రూ.3.70 లక్షలు, కేశఖండన టిక్కెట్ల ద్వారా రూ.66 వేలు, 57 వేల లడ్డూ ప్రసాదం టిక్కెట్ల ద్వారా రూ.8.55 లక్షలు ఆదాయం లభించినట్లు తెలిపారు.