
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఓటర్ల జాబితాల పరిశీలన, సవరణలకు సంబంధించి తొలివిడత పరిశీలన శనివారంతో పూర్తయింది. ప్రస్తుతం ముసాయిదా జాబితాల ప్రచురణకు అధికారులు తలమునకలై ఉన్నారు. ఈ మేరకు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు ఇంటింటి సర్వే నిర్వహించారు. బిఎల్‌ఓలు స్వయంగా ఇంటింటికి వెళ్లి జాబితాలను పరిశీలించారు. తరువాత అభ్యంతరాలు వ్యక్తమైన ప్రాంతాల్లో జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి వచ్చారు. స్థానికంగా ఉండకపోవడం, మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం, రాజకీయ పార్టీల ఫిర్యాదులపై విచారణ వల్ల సెప్టెంబరు 30 వరకు పరిశీలన కొనసాగింది. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 16 వరకు సప్లిమెంటరీ జాబితాలను రూపొందిస్తారు. అక్టోబరు 17న డ్రాప్టు ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురిస్తారు. అక్టోబరు 17 నుంచి 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబరు 28, 29, నవంబరు 18,19 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి కొత్త ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యంతరాలు, దరఖాస్తులను డిసెంబరు 26న పరిష్కరిస్తారు. జనవరి ఒకటిన తుది జాబితా సిద్ధం చేస్తారు.
నియోజకవర్గానికి ఒక్కొ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఉన్న రిటర్నింగ్ అధికారులు ఈసారి గ్రామస్థాయిలో ఎక్కువగా పర్యటించి క్షేత్రస్థాయిలో ఒకటికి రెండుసార్లు పరిశీలన చేశారు. 39,428 మందిని అనర్హులుగా నిర్ధారిస్తూ స్థానికంగా ఉన్న వైసిపి, టిడిపి నాయకులు ఫారం-7 దాఖలు చేశారు. తాడికొండ నుంచి అత్యధికంగా 10,921 మంది స్థానికంగా లేరన్న కారణంగా ఫారం-7 ద్వారా తొలగించాలని జాబితాలను సమర్పించారు. ప్రత్తిపాడులో 10,231 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై అధికారులు పరిశీలన చేయగా 23,505 దరఖాస్తులు తప్పుగా ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో 23,505 పేర్లను జాబితాల నుంచి తొలగించకుండా చేయడంలో అధికారులు కొంత మెరుగ్గా పనిచేశారు. ఫారం-7 ద్వారా తొలగించాలని దాఖలు అయిన దరఖాస్తుల్లో మరో 13 వేలవరకు పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలనలో జిల్లా మొత్తం మీద 44,524 మంది మృతి చెందినట్టు నిర్థారణవగా వీరి పేర్లను జాబితాల నుంచి తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో వివరాలను అప్‌లోడ్ చేశారు. ఈ ఏడాది జనవరి నాటికి జిల్లాలో 17,11,082 మంది ఓటర్లున్నారు. తాడికొండ-1,99,465, మంగళగిరి -2,73,932, పొన్నూరు - 2,23,217, తెనాలి-2,57,889,పత్తిపాడు- 2,54,815, గుంటూరు పశ్చిమ -2,64,741, గుంటూరు తూర్పు-2,37,023 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా కొత్తగా మరో 60 వేల మంది వరకు చేరినట్టు తెలిసింది. దీంతో పెరుగుదల స్వల్పంగా ఉండవచ్చునని భావిస్తున్నారు.