ప్రజాశక్తి - పెదకూరపాడు : పల్నాడు జిల్లాను ఒకవైపు వర్షాభావం పట్టి పీడిస్తుంటే మరోవైపు పల్నాడు జిల్లాలోనే పెదకూరపాడులో అధిక వర్షం పత్తి, మిర్చి పైర్లకు చిక్కులు తెస్తోంది. నాలుగు రోజులుగా వీడని వర్షం, సూర్యుడు అసలు రాకపోవడంతో సాగు ప్రారంభ దశల్లో ఉన్న పొలాల్లో నీరు నిలుస్తున్నాయి. పెదకూరపాడు మండలంలో ఇప్పటి వరకు 10 వేల ఎకరాల్లో పత్తి, మరో 10 వేల ఎకరాల్లో మిర్చి సాగవుతున్నట్లు అధికారుల అంచనా. పత్తిపైరు 10-20 రోజుల మధ్యలో ఉంది. మొక్క తొలి దశ కావడంతో అరక దున్నితే మొక్కలు కదుతాయని ఇంత వరకూ అంతర్ కృషి ఏమీ చేయలేదు. అయితే తాజా వర్షాలతో పత్తి పొలాల్లో కలుపు పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు పల్లపు ప్రాంతాల్లోని మొక్కలూ కుళ్లిపోతాయని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.10 వేల వరకూ ఖర్చు చేశారు. కౌలు కోసం మరో రూ.10-15 వరకూ ఉంది. గతేడాది కూడా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తొలుత అధిక వర్షాలు, తర్వాత గులాబీ రంగు పురుగుతో పైరు దెబ్బతిని రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఇదిలా ఉండగా మిర్చి సాగుకు కొంతమంది రైతులు నర్సరీల నుండి నారు తెచ్చుకోవడం కాకుండా సొంతంగా విత్తనాలు తెచ్చుకుని తమ పొలాల్లోనే నారు పెంచుకుంటున్నారు. ఇవి కూడా నాలుగు నుండి పది రోజుల వ్యవధిలో ఉన్నాయి. విత్తనాలు నాటినప్పటి నుండి ముసురు పట్టుకోవడంతో గింజలు మొత్తం దెబ్బతిం టాయేమోనని రైతులు భయపడుతున్నారు. పొడి వాతావరణంలోనే విత్తనాలు బాగా మొలకెత్తుతాయని, తాజా వానలతో అధిక శాతం విత్తనాలు పాడవుతాయని రైతులు తమ గతానుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే విత్తనాలను ఎంఆర్‌పికి మించి వ్యాపారులు అమ్మడంతో రైతులు ఎకరాకు రూ.10 వేల నుండి రూ.30 వేల వరకూ వెచ్చించి విత్తనాలు కొనుగోలు చేశారు. ఇది కాకుండా కౌలు మరో రూ.20-30 వేల వరకూ ఉంది. ఇంత చేసి మొలకలు రాకపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన పడుతున్నారు. అయితే తాజా వర్షాలతో పెద్దగా నష్టమేమీ ఉండకపోవచ్చని మండల వ్యవసాయాధికారి శాంతి చెప్పారు. వర్షం తగ్గిన వెంటనే నీటిని బయటకు పంపాలని, అరకలు దున్నాలని సూచించారు.










