Oct 04,2023 21:20

మొల్ల స్మారక స్థూపాన్ని ఆవిష్కరిస్తున్న విసి సుధాకర్‌

కడప అర్బన్‌ : మొల్ల సాహితీ పీఠం ఆధ్వర్యంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 'మొల్ల సాహితీ స్మారక స్తూపం' ఆవిష్కరించుకోవడం మొల్ల కీర్తిని ఇనుమడింపజేసినట్లేనని వైవీయూ విసి ఆచార్య చింతా సుధాకర్‌ పేర్కొన్నారు. సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ప్రాంగణంలో బుధవారం మొల్ల సాహితీ పీఠం ఆధ్వర్యంలో 'మొల్ల సాహితీ స్మారక స్తూపం' ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విసి చింతా సుధాకర్‌ మాట్లాడుతూ మొల్లమాంబ సంస్కత వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు సాహిత్య చరిత్రలో తొలి కవయిత్రిగా స్థానం సంపాదించుకోగా ఆమె కీర్తిని చిరస్థాయిగా నిలిపిన ఘనత గానుగపెంట హనుమంతరావుకు దక్కుతుందన్నారు. బద్వేలు సమీపంలోని గోపవరాన్ని మొల్ల జన్మస్థలంగా గుర్తించి, ఆ ప్రాంతంలో మొల్లమాంబ విగ్రహం ఏర్పాలు చేయడంతోపాటు ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడం వెనుక గానుగపెంట చేసిన కషి అభినందనీయమన్నారు. మొల్ల పేరుపైన పీఠాన్ని ఏర్పాటు చేసి మొల్ల జయంతిని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ పురస్కారాలు ప్రదానం చేయడం విశేషమన్నారు. గానుగపెంట హనుమంతరావును ఘనంగా సత్కరించారు. పాలకమండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ఇటీవల యోగి వేమన విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ బ్లాకులో ఉన్న సమావేశ మందిరానికి 'మొల్ల సమావేశ మందిరం'గా నామకరణం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మొల్ల పేరు ప్రస్తావనకు వచ్చినపుడు గానుగపెంట హనుమంతరావు స్మరణకు వచ్చేలా విశేషంగా కార్యక్రమాలు చేస్తూ చరిత్రలో నిలిచిపోయారన్నారు. సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య తప్పెట రామప్రసాద రెడ్డి మాట్లాడుతూ సాహిత్య నిలయంగా విరాజిల్లుతున్న బ్రౌన్‌ కేంద్రంలో మొల్ల సాహితీ స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. ఎంతో శ్రమకోర్చి స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేసిన గానుగపెంట హనుమంతరావు అభినందనీయుడన్నారు. సాహితీ పరిమళాలు వెదజల్లేలా భవిష్యత్తులో ఈ స్తూపం నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో మొల్ల సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్‌ గానుగపెంట హనుమంతరావు, విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యాపకులు ఆచార్య పి.రమాదేవి, విశ్రాంత తెలుగు పండితులు డాక్టర్‌ వెల్లాల వేంకటేశ్వరాచారి, వైస్‌ఛాన్సలర్‌ పి.ఎ నాగరాజు, సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్‌ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి, గ్రంథపాలకులు ఎన్‌.రమేశ్‌రావు, జూనియర్‌ అసిస్టెంట్లు ఆర్‌.వెంకట రమణ, ఎం.మౌనిక, సిబ్బంది సి.నీలకంఠేశ్వర్‌, పి.చంద్రకిశోర్‌, జె.లక్ష్మన్న, అరుణ పాల్గొన్నారు.