Aug 01,2021 11:44

శ్రీనగర్‌ : అనుకుంటే సాధించలేదని ఏమీ లేదని నిరూపించాడు జమ్ముకాశ్మీర్‌కు చెందిన ఓరైతు బిడ్డ. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ఇండియన్‌ ఎకనామక్‌ సర్వీస్‌ (ఐఇఎస్‌)లో తొలి ప్రయత్నంలోనే 2వ ర్యాంక్‌ తెచ్చుకుని...ఔరా అనిపించారు. శీతాకాలంలో రిక్షా తోలేందుకు కోల్‌కతా వెళ్లిన వ్యక్తి ఇప్పుడు ఈ ఘనత సాధించడంతో కుటుంబంతో పాటు స్వగ్రామం పులకించిపోతుంది. వివరాల్లోకి వెళితే జమ్ముకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని మారుమూల ప్రాంతం నిగిన్‌పోరా కుంద్‌ గ్రామంలో నివసిస్తోంది తన్వీర్‌ అహ్మద్‌ ఖాన్‌ కుటుంబం. అతడి తండ్రి ఓ రైతు. ఇటీవల యుపిఎస్‌సి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఐఇఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడవ్వడమే కాకుండా 2వ ర్యాంక్‌ తెచ్చుకుని గ్రామానికి, ఆ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. తన్వీర్‌ ప్రాథమిక విద్య అంతా కుంద్‌ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పూర్తయిందని, వాల్టెంగూలోని ప్రభుత్వ హైస్కూల్‌లో ఉన్నత విద్యనభ్యసించారని అధికారులు చెప్పారు. 12వ తరగతి హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ ఉత్తీర్ణుడయ్యాక...అనంతనాగ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2016లో బిఎ పూర్తి చేశారు.
తొలి నుండి చదువు అంటే ఇష్టపడే తన్వీర్‌...కాశ్మీర్‌ యూనివర్శిటీ ప్రవేశ పరీక్షల్లో మూడవ ర్యాంక్‌ను తెచ్చుకోవడమే కాకుండా...అదే విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోర్సులో ప్రవేశం పొందారు. పిజిలో ఉండగా..చివరి సంవత్సరంలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జెఆర్‌ఎఫ్‌) సాధించడం ద్వారా మరో ఘనతను సాధించాడు. జెఆర్‌ఎఫ్‌ ఫెలోగా..కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో ఎంఫిల్‌ చేశారు. తాను సాధించిన విజయంపై తన్వీర్‌ మాట్లాడుతూ...లక్ష్యంపై గురిపెడితే ..ఏదీ అసాధ్యం కాదు అని చెబుతున్నారు. కరోనా సమయాన్ని కూడా సద్వినియోగపరుచుకున్న విషయాన్ని పంచుకున్నారు. కోవిడ్‌ సమయంలో ఇంట్లోనే ఉంటూ..ఎంఫిల్‌ చేస్తూనే ఐఇఎస్‌ పరీక్షకు సిద్ధమయ్యానని చెప్పారు. కోవిడ్‌ను కూడా లెక్కచేయకుండా తను నిర్ధేశించుకున్న షెడ్యూల్‌ ప్రకారం ప్రిపేర్‌ అయ్యాయని తెలిపారు. తొలి ప్రయత్నంలోనే ఐఇఎస్‌ రెండో ర్యాంకును సాధించిన తన్వీర్‌...కష్టమైనప్పటికీ... ఎక్కడా ఆశను కోల్పోలేదని చెప్పారు. తన తొలి ప్రయత్నాన్నే..చివరి ప్రయత్నంగా భావిస్తూ చదివానని, తన లక్ష్యాన్ని సాధించానని అన్నారు. విద్యా సంస్కరణలను ప్రశంసించిన ఆయన...ప్రాథమిక విద్యా విధానాన్ని పునరుద్ధరించాల్సిన అవసరముందని సూచించారు. ఈ సందర్భంగా తన్వీర్‌కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అభినందనలు తెలిపారు.