ప్రజాశక్తి-అద్దంకి : అద్దంకి పట్టణంలోని ప్రధాన రహదారిపై శ్రీ కమటేశ్వరాలయం వెనుక వైపు ఉన్న తొలి పద్యశాసనాన్ని చరిత్రకారులు బుధవారం సందర్శించారు. ప్లీజ్ ఇండియా ఫౌండేషన్ సిఇఒ డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి, ప్రకాశం, బాపట్ల జిల్లాల చరిత్రకారులు విద్వాన్ డాక్టర్ జ్యోతి చంద్రమౌళి, ప్రముఖ జర్నలిస్ట్ బుద్ధవనం, ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య కామటేశ్వర ఆలయాన్ని, పండరంగుడి శాసనాన్ని సందర్శించారు. ఇది తొలి తెలుగు పద్య శాసనమని, తూర్పు చాళుక్యు రాజుల మూడో గుణగ విజయా దిత్యుని సేనా నాయకుడైన అద్దంకి పాండురంగడు 12వ బోయ కొట్టు ములను జయించి, కందుకూరును బెజవాడ లాగా అభివద్ధి చేసి ధర్మవరానికి చెందిన తన గురువైన ఆదిత్య భటారాకునికి చెందిన 80 పుట్ల భూమిని దానం చేసినట్లు క్రీస్తుశకం 848 సంవత్సరం శాసనంలో ఉందని జ్యోతి చంద్రమౌళి వివరించారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత గల ఈ తెలుగు పద్య శాసనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠ్యాంశంగా చేర్చాలని ఈమని శివనాగిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి హరితేజ, సొసైటీ కార్యదర్శి, దశరథ రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










