Nov 19,2023 22:20

లంపీస్కిన్‌ మచ్చలు సోకిన ఆవు

       అనంతపురం ప్రతినిధి : పాడి రైతులకు ఇప్పటికీ లంపి స్కిన్‌ (ముద్ద చర్మం) గుబులు తొలగడం లేదు. గతేడాది ఈ జబ్బుతో పెద్దఎత్తున ఆవులు, దూడలు ఈ జబ్బుబారినపడి చనిపోయాయి. చర్మం ముద్దగా మారి, మేత కూడా తినలేని పరిస్థితుల్లో చనిపోతూ వచ్చాయి. ఒక దాని నుంచి మరొకదానికి అంటు వ్యాధి కూడా కావడంతో నియంత్రించడం ఇబ్బందిగా మారింది. వ్యాక్సిన్‌ ద్వారా అరికట్టే చర్యలు చేపట్టారు. అయినా ఈ ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో అక్కడక్కడ లంపీస్కిన్‌ జబ్బు బారిన జంతవులున్నాయి.
చాపకింద నీరులా లంపిస్కీన్‌
లంపిస్కిన్‌ ఈ ఏడాది చాపకింద నీరులా వ్యాప్తి చెందుతూనే ఉంది. పెద్దపప్పూరు మండలంలో రెడ్డిపల్లితోపాటు మూడు గ్రామాల్లో మూడు ఆవులు దీనిబారినపడి మృత్యువాతపడ్డాయి. మరికొన్ని ఇప్పటికీ దీని బారినపడిన దూడలున్నాయి. అదే విధంగా బొమ్మనహల్‌ మండలంలోని దర్గాహొన్నూరు, గోవిందవాడ, బొల్లనగుడ్డం గ్రామాల్లో ఈ జబ్బుబారిన పడిన పశువులు అత్యధికంగానున్నాయి. పుట్లూరు మండలంలోని లంపిస్కీన్‌, అదే రకంగా తీవ్రమైన జ్వరాలతోనూ ఏకంగా 40 ఆవులు మృత్యువాతపడ్డాయి. సత్యసాయి జిల్లాలో పలుచోట్ల దీనిబారినపడిన ఆవులు, దూడలున్నాయి. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆవులు, దూడలు చనిపోతాయన్న ఆందోళన పాడి రైతుల్లో నెలకొంది.
వైద్యసేవల్లోనూ ఇబ్బందులు
రోగాలబారినపడిన పశువులకు వైద్యసేవలందించడంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. తగినంత మంది పశువైద్యుల్లేకపోవడంతో కూడా సమస్యగా మారింది. పుట్లూరులోనూ ఇదే రకమైన సమస్య ఉండగా, బొమ్మనహళ్‌లో పశువుల అంబులెన్సులున్నా ఆశించిన ప్రయోజనం ఉండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది మాత్రం టీకాలు వేయని వాటికి మాత్రమే ఈ ఏడాది వస్తున్నట్టు చెబుతున్నారు.
టీకాలు వేయని వాటికే ఈ జబ్బు
సుబ్రమణ్యం, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి.

జిల్లాలో అక్కడక్కడా ఈ జబ్బు లక్షణాలున్న మాట వాస్తవమే. గతేడాది జబ్బు వచ్చిన సమయంలో గర్బంతోనున్న వాటికి, దూడలకు ఈ వ్యాక్సిన్‌ వేయలేదు. ఎందుకంటే గర్బంతోనున్న వాటికి వేస్తే అబార్షన్‌ అయ్యే అవకాశముంది. అందుకే వేయలేదు. గతంలో వ్యాక్సిన్‌ వేయని వాటిపైనే దీని ప్రభావముంది. ఎక్కువగా దూడలకు వస్తోంది. గతంలో వేయకుండా మిగిలిపోయిన వాటికి కూడా ఈ ఏడాది వ్యాక్సినేషన్‌ చేయడం జరుగుతోంది. చాలా వరకు నియంత్రణలోనే ఉంది. పుట్లూరులో ఎక్కువ పశువులు చనిపోయినట్టు తమకు సమాచరమెస్తే వైద్య బృందాన్ని పంపించి పరిశీలించాం. అందులో కొన్ని ప్లాస్టిక్‌ వంటివి తిని చనిపోయినట్టు తేలింది. మరికొన్ని జ్వరాలతో చనిపోయాయి. లంపిస్కిన్‌తో చనిపోలేదు.