తిరుమల కల్యాణకట్ట క్షురకులకు...
తొలగిన కెవొడి కష్టాలు
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం తమ దగ్గర పనిచేస్తున్న కార్మికుల పట్ల అధర్మంగా వ్యవహరిస్తోంది. కార్మికులకు పని ఒత్తిడి కారణంగా, కెవొడి పేరుతో (ఉద్యోగుల తొలగింపు) అకారణంగా తొలగిస్తోంది. తొలుత కల్యాణకట్టలో కెవొడి విధానాన్ని అమలు చేసి 19 మంది క్షురకుల పట్ల కఠినంగా వ్యవహరించడమే గాకుండా ఆర్నెళ్లు, ఏడాది పాటు డ్యూటీలకు రావద్దంటూ ఆంక్షలు విధించారు. ఓ మహిళా క్షురకురాలు గుండు గీస్తున్న సందర్భంలో కరెంట్ పోవడంతో సెల్‌ఫోన్ టార్చి వేసి ఓ చిన్నారికి గుండు గీసింది. అయితే కరెంట్ పోయిన సందర్భంలో గుండు ఎందుకు చేశావంటూ అధికారులు ఆమెను ఆర్నెళ్ల పాటు డ్యూటీకి రావద్దంటూ కెవొడి పేరుతో నిలిపేశారు. అలాగే మరో మహిళ క్షురకురాలు నాలుగు రోజుల పాటు సెలవు తీసుకుంది. ఐదో రోజు ఆబ్సెంట్ కావడంతో మూడు నెలల పాటు డ్యూటీకి రావాల్సిన పని లేదంటూ నిలిపేశారు. అలాగే ఓ పురుష క్షురకునికి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోవడంతో డ్యూటీకి రాలేదు. దీంతో అతనిని ఏడాది పాటు విధులకు రావద్దంటూ ఆంక్షలు విధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అకారణంగా 19 మందిపైన వేధింపులకు గురిచేస్తూ నిలిపేశారు. దీంతో పెద్దఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో క్షురకులు ఆందోళనకు దిగారు. ఒకానొక సమయంలో తాము కెవొడి విధానం ఎత్తేయాలంటూ మెరుపు సమ్మె చేశారు. అప్పటికీ టిటిడి యాజమాన్యం నుంచి స్పందన లేదు. దీంతో సిఐటియు ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటం చేశారు. కల్యాణకట్టలో ఖాళీగా ఉన్న పోస్టులను 114 జీవో ప్రకారం అర్హులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆధ్వర్యంలో తిరుపతి పద్మావతిపురంలో నివాసం ఉంటున్న టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిని వందలాది మంది క్షురకులు వెళ్లి తమ గోడు వినిపించారు. క్షురకులు, టిటిడి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు, ఫారెస్టు కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని భూమన కరుణాకర్‌రెడ్డికి వివరించారు. దీంతో స్పందించిన కరుణాకర్‌రెడ్డి కెవొడి విషయం తన దృష్టిలో లేదని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకుంటామని, అర్హులైన క్షురకులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. 2014 కటాఫ్ తేదీ కాకుండా, సిఎంతో మాట్లాడి మరింత సమయం పెంచనున్నట్లు వెల్లడించారు. దీంతో క్షురకులు హర్షం వ్యక్తం చేస్తూ టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
క్షురకుల సమస్యలు వివరిస్తున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి