ప్రజాశక్తి - పార్వతీపురం : జిల్లాలో తొలగించిన ప్రతి ఓటు పరిశీలిస్తున్నామని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు పునశ్చరణ కార్యక్రమంపై బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తొలగించిన ప్రతి ఓటు పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. జిల్లాలో ఇంటింటి ఓటరు విచారణ 0.19 శాతం మాత్రమే పెండింగ్ ఉందన్నారు. పాలకొండ నియోజకవర్గంలో 198633 ఓటర్లు ఉండగా 452 మందిని, కురుపాంలో 186700 ఓటర్లు ఉండగా 98 మందిని, పార్వతీపురంలో 187815 ఓటర్లు ఉండగా 93 మందిని, సాలూరు నియోజకవర్గంలో 197825 ఓటర్లు ఉండగా 822 మందిని పరిశీలించాల్సి ఉందని తెలిపారు. ఇంటింటి విచారణలో 4622 మంది లేనట్లు (ఆబ్సెంట్) గుర్తించామన్నారు. 3213 మంది శాశ్వతంగా ఆయా గ్రామాల నుంచి వెళ్లిపోయిన ఓటర్లను గుర్తించామన్నారు. అలాగే 13,994 మంది ఓటర్లు మృతి చెందినట్లు గుర్తించినట్టు చెప్పారు. 1861 డుప్లికేట్ ఓట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. జిల్లాలో మొత్తం దరఖాస్తులు 95141 అందగా అందులో పాలకొండ నియోజకవర్గంలో 33382, కురుపాంలో 29195, పార్వతీపురంలో 12891, సాలూరులో 19673 ఉన్నాయని చెప్పారు. ఇందులో 1152 తిరస్కరించగా, 15139 అంగీకరించామని, 18228 ఓటరు జాబితాలో చేర్చామని, 60622 పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వివరించారు. ఓటరు జాబితాలో దిద్దుబాటు కోసం ఫారం 8 కింద 60535 దరఖాస్తులు, ఫారం-6 కింద 16686, ఫారం 7 క్రింద 17920 దరఖాస్తులు అందాయన్నారు. ఏప్రిల్ 15 నుండి ఆగస్టు 29 వరకు 3365 ఓట్లు చేర్చ చేర్చామని, 2107 ఓట్లు తొలగించినట్టు తెలిపారు. అలాగే 12756 ఓటర్లు చేర్పులు, మార్పులు చేశామన్నారు. ఓటరు జాబితాలో తప్పులు గమనిస్తే దరఖాస్తు చేయవచ్చని, ఇవిఎంలు వస్తున్నాయని చెప్పారు. సమావేశంలో డిఆర్‌ఒ జె.వెంకట్రావు, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.










