తాడేపల్లి: తమకు సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేసిన గుంటూరు నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులపై అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం, వారిని విధుల నుంచి తొలగించడం అన్యాయమని, దీనిని ఖండిస్తున్నామని సిఐటియు పట్టణ కార్యదర్శి వేముల దుర్గారావు, మున్సిపల్ యూనియన్ నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం తాడేపల్లి పట్టణంలోని కృష్ణనగర్, నులకపేట, పాత పంచాయతి కార్యాలయాల వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో వారు పాల్గొని మాట్లాడారు. అక్రమంగా తొలగించిన పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సంబంధిత నగరపాలక సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. విధుల నుంచి తొలగించిన కార్మికుల్లో ఒకరైన విమల మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్ప డటానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కె.వెంగమ్మ, కొండయ్య, రాంబాబు పాల్గొన్నారు.
24న సభకు తరలిరండి
కార్మిక హక్కులను కాలరాస్తూ కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మిక శ్రమను కారుచౌకగా కార్పొరేట్లకు దోచిపెడుతున్న బిజెపి విధానాలకు నిరసనగా ఈ నెల 24న మంగళగిరిలో జరిగే బహిరంగ సభకు కార్మికులు పెద్దఎత్తున తరలిరావాలని సిపిఎం నాయకులు వేముల దుర్గారావు, బూరుగ వెంకటేశ్వర్లు కోరారు. మంగళగిరి ఆటోనగర్‌లో జరిగే ఈ బహిరంగ సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరవుతారని చెప్పారు.










