Sep 04,2023 22:25

ఫొటో : మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

తొలగించిన ఓట్లపై కలెక్టర్‌ వెరిఫికేషన్‌
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో తొలగించిన ఓట్లను రాండంగా రీవెరిఫికేషన్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ తెలిపారు. ఓటర్ల జాబితా నుండి ఓటు తొలగించిన విషయమై క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసు కునేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరి నారాయణన్‌ సోమవారం ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం పడమటిపాలెం గ్రామంలో, ఆత్మకూరు పట్టణంలోని 11వార్డు బలిజ వీధి లో పలుచోట్ల తనిఖీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారిగా ఆత్మకూరు మండలం పడమటి పాలెం, ఆత్మకూరు పట్టణంలో చనిపోయిన, రెండు ఓట్లు నమోదయిన వారి ఓటు తొలగింపు, వేరే ప్రాంతాలకు నివాసం మార్చు కున్నవారి ఓటు తొలగించడంపై వాస్తవ పరిస్థితిని కలెక్టర్‌ వారి ఇంటికి వెళ్లి పరిశీలించారు.
జనవరి 6, 2022 నుండి 21.7.23 వరకు ఓటరు జాబితా నుండి ఓటు తొలగించిన వారి విషయమై ఇప్పటికే 5 నియోజక వర్గాలలో ర్యాండంగా తనిఖీ చేశామన్నారు. తొలగింపు ప్రక్రియ సక్రమంగా చేశారా లేదా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లాలోని ప్రతి నియోజక వర్గంలో ఓట్లు తొలగించబడిన 10 మంది ఇళ్లకు వెళ్లి ప్రతి తనిఖీ చేస్తున్నామన్నారు. ఓటరు వివరాలు రికార్డులు భద్రంగా ఉంచాలని ఆధి కారులకు సూచించారు. కలెక్టర్‌వెంట ఆర్‌డిఒ ఎస్‌.కరుణకుమారి, తహశీల్దార్‌ నాగరాజు, ఆత్మకూరు డి.టి. రాజేష్‌ బాబు, వార్డు సెక్రెటరీలు, విఆర్‌ఒలు, బిఎల్‌ఒలు, తదితరులున్నారు.