ప్రజాశక్తి -గాజువాక : గంగవరం పోర్టు యాజమాన్యం కక్షసాధింపుతో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గంగవరం పోర్ట్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షులు కొవిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. కనీస వేతనాల అమలు, ఇతర సమస్యల పరిష్కారానికి ఈ నెల 20న కలెక్టరేట్ వద్ద జరగనున్న ధర్నాలో పాల్గొనాలని సిఐటియు ఆధ్వర్యంలో విస్తృతంగ చేపడుతున్న ప్రచారంలో భాగంగా పోర్టు గేటు వద్ద కార్మికులకు వినతిపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ వేతన పెంపు, ఇతర సమస్యలపై ఇటీవల గంగవరం పోర్టు కార్మికుల్లో వచ్చిన ఐక్యతను జీర్ణించుకోలేని యాజమాన్యం కక్ష సాధింపులకు పాల్పడి, దిబ్బపాలేనికి చెందిన నిర్వాసిత ఉద్యోగి గంటిపిల్లి లక్ష్మయ్యను విధుల నుంచి తొలగించిందని, మరికొందరికి మెమోలు, ఛార్జిషీట్లు జారీ చేసిందన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కాంట్రాక్ట్ కార్మికులు రూ.26వేలు, పర్మినెంట్ కార్మికులకు రూ.36వేలు నెలసరి వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. విశాఖ పోర్టు యాజమాన్య కార్మికులకు సమానంగా గంగవరం పోర్టులోనూ కార్మికులకు వేతనాలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కణితి అప్పలరాజు వి గణేష్ పాల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు










