Aug 12,2023 00:03

బ్యాంకు ఎదుట ఆందోళన చేస్తున్న ఖాతాదార్లు

ప్రజాశక్తి - క్రోసూరు : బ్యాంకులో తాము తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు కనిపించడం లేదని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు (సిజిజిబి) ఎదుట ఖాతాదారులు, రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వ్యవసాయ అవసరాల కోసం 10 గ్రామాల రైతులు బంగారాన్ని తనఖా పెట్టి రుణాలు పొందారు. అయితే రుణాలను తిరిగి చెల్లించగా తమ ఆభరణాలు మాత్రం ఇవ్వటం లేదని వాపోతున్నారు. బ్యాంకులో అప్రైజర్‌గా పని చేసే నాగార్జునకు తాము ఇచ్చిన వస్తువుల కంటే తక్కువగా ఇస్తున్నారని, కొన్నింటిని మాయం చేశారని చెబుతున్నారు. మరోవైపు దీనిపై ఇప్పటికే బ్యాంకు ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. తమ ఆభరణాలు కనిపించడం లేదని పలువురు ఖాతాదారులు గురువారం రాత్రి 9 గంటల వరకూ బ్యాంకు వద్దే నిరీక్షించగా శుక్రవారం ఉదయం బ్యాంకు సిబ్బందిని లోనికి పోకుండా అడ్డుకున్నారు. విషయం తెలిసిన ఎస్‌ఐ పాల్‌ రవీంద్ర అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. రోజుకు 50 మంది ఖాతాదారులకు ఆభరణాలను తిరిగిచ్చేలా ఒప్పించడంతో ఆందోళన ముగిసింది. అయితే బ్యాంకు రసీదుల్లో ఎన్ని ఆభరణాలను నమోదు చేశారో తెలియడం లేదని ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది ఆరు వస్తువులను తనఖా పెట్టగా వాటిల్లో నాలుగు వస్తువులనే ఖాతాదార్ల పేరుతో రికార్డుల్లో నమోదు చేశారని, మిగతా వస్తువులను మరో పేరు మీద అప్రైజర్‌ అవకతవకలకు పాల్పడ్డారని అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. సుమారు రూ.కోటిన్నర వరకు అవకతవకలు జరిగినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి ఖాతాదార్లకు న్యాయం చేస్తామని బ్యాంకు మేనేజర్‌ మధుబాబు తెలిపారు.