Nov 06,2023 21:31

రహదారిపై నిరసన తెలుపుతున్న విద్యార్థులు

ప్రజాశక్తి - నెల్లిమర్ల :  మండలంలోని తంగుడుబిల్లి వద్ద ఆర్‌టిసి బస్సు ఆపాలని గ్రామస్థులు కోరుతున్నారు. సోమవారం తంగుడు బిల్లి జంక్షన్‌ వద్ద ఆర్‌టిసి బస్సు ఆపాలని కోరుతూ ఎంపిటిసి చందక చిన్నం నాయుడు ఆధ్వర్యంలో విద్యార్డులు, ప్రయాణికులు, యువత ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎంపిటిసి చందక చిన్నం నాయుడు మాట్లాడుతూ నిత్యం తంగుడుబిల్లి నుంచి విద్యార్దులు, ప్రయాణుకులు 100మందికి పైగా విజయనగరం వెళ్తారని ఆ సమయంలో బొప్పడాం నుంచి విజయనగరం వెళ్లే ఆర్‌టిసి బస్‌ ఆపకుండా వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే బస్‌లో ఇతర గ్రామాల ప్రజలు ఉండడంతో ఆపడం లేదన్నారు. దీంతో విద్యార్దులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడి కళాశాలలకు, ఇతర పనులకు వెళ్లకుండా ఉండి పోతున్నారన్నారు. సతివాడ నుంచి తంగుడు బిల్లి మీదుగా ఆర్‌టిసి బస్సు వేసి విద్యార్దులు, ప్రయాణికులు కష్టాలను తీర్చాలని ప్రస్తుతం తిరుగుతున్న బస్సును తంగుడుబిల్లి జంక్షన్‌ వద్ద కచ్చితంగా ఆపాలని కోరారు. అనంతరం ఆర్‌టిసి జోనల్‌ చైర్‌పర్సన్‌ గదల బంగారమ్మ, డిపో మేనేజర్‌, ఇతర అధికార్లకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.