Sep 08,2023 21:45

ఫొటో : ఆర్‌డిఒకు ఫిర్యాదు చేస్తున్న కావలి ఎల్డర్స్‌ క్లబ్‌ సభ్యులు

తండ్రిని వద్దన్న కొడుకుపై చర్యలు తీసుకోవాలి
ప్రజాశక్తి-కావలి : స్థానిక దొడ్లవారి వీధిలో స్వగృహంలో నివసిస్తూ ఇంటిని చిన్నకొడుకు, గ్రంధి శ్రీనివాసులుకు రాసిచ్చి, అదే ఇంట్లో ఒక భాగంలో ఉంటున్న తండ్రి గ్రంధి వెంకయ్యను పోషించ కుండా నిరాదరణకు గురిచేసిన కుమారుడిపై చర్యలు తీసుకోవాలని కావలి ఎల్డర్స్‌ క్లబ్‌ వారు ఆర్‌డిఒకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంధి శ్రీనివాసులు పెట్టే బాధల గురించి వెంకయ్య 'ఎల్డర్స్‌ క్లబ్‌' నిర్వాహకులను ఆశ్రయించినట్లు తెలిపారు. తన గోడు వెళ్లబుచ్చుకోగా, గౌరవాధ్యక్షులు, దుగ్గిశెట్టి బాలయ్య, అధ్యక్ష, కార్యదర్శులు జెబిఎమ్‌ నాయుడు, గోపీకృష్ణ, ఉపాధ్యక్షులు సి.శారద, కార్యవర్గ సభ్యులు పార్వతీశంకర్‌, విద్యావతి తదితర సభ్యులు గ్రంధి శ్రీనివాసులు, అతని తండ్రి గ్రంధి వెంకయ్యలను పిలిచి కూర్చొనబెట్టి కౌన్సిలింగ్‌ చేశారన్నారు.
శ్రీనివాసులు ఎల్డర్స్‌ క్లబ్‌ వారి సూచనల మేరకు 2021 జూలై నెల నుండి తన తండ్రి పోషణ నిమిత్తం తన వంతుగా తండ్రి వెంకయ్యకు ప్రతినెలా రెండవ తేదీ రూ.5వేలు ఇస్తాననీ, తన ఇల్లు అమ్మిన పక్షంలో, వేరొకబాడుగ ఇల్లు తీసుకుంటే, దాని అద్దె చెల్లిస్తానని, లిఖిత పూర్వక హామీ ఇచ్చాడని తెలిపారు. కానీ, సదరు శ్రీనివాసులు తనమాట బాధ్యతను తప్పి, నాలుగు నెలలుగా వెంకయ్య పోషణ బాధ్యతను తప్పించుకుని తిరుగుతున్నారన్నారు. క్లబ్‌ సభ్యులు అడిగితే ''తానిక ఇవ్వనని'' చెప్పినట్లుగా శుక్ర వారం ఆర్‌డిఒ వి.కె. శీనా నాయక్‌ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. గ్రంధి శ్రీనివాసులు తమ క్లబ్‌ కు వ్రాసిచ్చిన హామీ పత్రాన్ని కూడా సమర్పించి, 80 ఏళ్ల వృద్ధ తండ్రిపై బాధ్యతా రహితంగా వ్యవహ రించిన శ్రీనివాసులును పిలిపించి తగుచర్యలను డివిజనల్‌ మేజిస్ట్రేట్‌గా, జాయింట్‌ కలెక్టర్‌గా తీసుకోవాలని కోరారు.