ప్రజాశక్తి-పిడుగురాళ్ల : వినాయక విగ్రహ నిమజ్జనంలో అపశృతి తలెత్తి తండ్రీ కొడుకులు దుర్మరణం పాలయ్యారు. మాచవరం మండలం గోవిందపురం కృష్ణానది వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘటనపై మాచవరం ఎస్‌ఐ సమీర్‌బాష వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల పట్టణంలోని 15వ వార్డు వికాస్ పబ్లిక్‌స్కూల్ ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయగా దాని నిమజ్జనం కోసం మాచవరం మండలం గోవిందపురంలోని కృష్ణా నదికి బుధవారం రాత్రి 9.30 గంటల తర్వాత బయలుదేరారు. నది వద్దకు చేరుకునే సరికి దాదాపు 11 గంటలైంది. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు అందరూ కలిసి మోసుకెళ్తుంగా నీరుమళ్ల శ్రీనివాసరావు (53), కుమారుడు వెంకటేశ్ (29), మరో ఇద్దరు నీటిలో గల్లంతయ్యారు. ఇది గమనించిన మిగతావారు కాపాడే ప్రయత్నం చేశారు. ఇద్దర్ని కాపాడినా శ్రీనివాసరావు, వెంకటేశ్ మాత్రం కనిపించలేదు. సమాచారం తెలసుకున్న మాచవరం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో రాత్రి నుంచి గాలించా రు. గురువారం ఉదయం వీరిద్దరి మృతదేహాలు ఘటనా స్థలికి కొద్దిదూరంలో దొరికాయి. మృతదేహాను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల్లో శ్రీనివాసరావు కూలి పనులు చేస్తుండగా, వెంకటేశ్ పిడుగురాళ్ల పట్టణంలోనే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుం టాడు. వెంకటేశ్‌కు తల్లి, తమ్ముడు, భార్య, కుమారుడు ఉన్నారు.










