
సూరిబాబు, సుబ్బరాజులకు పలువురి అభినందనలు
ప్రజాశక్తి - కాళ్ల
మండలంలోని జువ్వలపాలెం, మారంపల్లి గ్రామాల్లో తమ తండ్రి పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జువ్వలపాలెం గ్రామస్తుడు (దాత) సరిపల్లి సూర్యనారాయణరాజు (సూరిబాబు) తెలిపారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన తమ్ముడు సుబ్బరాజు తాను మంచి ఆశయాలతో తమ తల్లి పుల్లమ్మ పుట్టిన ఊరు జువ్వలపాలెంలో, తమ తండ్రి పుట్టిన ఊరు మారంపల్లిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జువ్వలపాలెం గ్రామంలో ప్రయాణికుల విశ్రాంతి భవనాన్ని సరిపల్లి జగన్నాథరాజు జ్ఞాపకార్థంగా ఆయన భార్య పుల్లమ్మ 1989లో నిర్మించారన్నారు. బస్టాండ్ శిథిలావస్థకు చేరడంతో పెరుగుతున్న రద్దీ, ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా పున:నిర్మాణం చేపట్టి పలు సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఒక ప్రణాళికతో ప్రయాణికుల విశ్రాంతి భవనం (బస్టాండ్)ను పున:నిర్మించి వివిధ రంగులతో అందంగా తీర్చిదిద్దామన్నారు. సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బెంచీలు, గ్రిల్స్‌లను సుమారు రూ.లక్షతో ఏర్పాటు చేశామన్నారు. దీంతో బస్టాండ్ రూపు రేఖలు మారిపోయాయన్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా 50 మందికి దుస్తులు పంపిణీ, అన్నసమారాధన నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏడాది వేసవిలో మజ్జిగ చలివేంద్రం నిర్వహిస్తున్నామన్నారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో వైద్య కేంద్రం, కళ్యాణ మండపాన్ని తమ తండ్రి సరిపల్లి జగన్నాథరాజు పేరుతో నిర్మించి నిర్వహిస్తున్నామని తెలిపారు.