Jul 14,2023 22:03

తహశీల్దార్‌కు వినతిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - సాలూరు :  మార్కెట్‌లో టమాటో ధరలు కిలో రూ.150కు పైగా పలుకుతున్నందున సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, రైతు బజారుల ద్వారా పంపిణీ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యాన సిఐటియు నాయకులు, కార్యకర్తలు మండల తహశీల్దార్‌ బాలమురళీకష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించి నిరుపయోగంగా వదిలేశారని చెప్పారు. రైతు బజార్‌ వినియోగంలో లేకపోవడంతో ధరల భారం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఎక్కువగా ఉందన్నారు. పేదలకు అందుబాటులో వుండేలా టమాటాలను వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, రైతు బజారుల ద్వారా పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎల్‌.ఈశ్వరరావు, టి.శంకరరావు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ : అమాంతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పాటు టమాటా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ధరలు తగ్గించేందుకు తగు చర్యలు చేపట్టాలని జనసేన నాయకులు కోరారు. శుక్రవారం ఆ పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్‌, కర్రి మణి, కొల్లి వెంకటరావు, ఎస్‌. సంతు, కె.నాని తదితరులు పెరిగిన నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతో పాటు నిత్యవసర సరుకులు ధరలు పెరిగి సామాన్యుడిని భయపెడుతున్నాయన్నారు. వాటితోపాటు గత కొద్ది రోజులుగా టమాటా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి తదితర వాటి ధరలు పెరిగి సామాన్యుడు బతకలేని విధంగా ఆర్థిక అవస్థలకు గురి చేస్తున్నాయన్నారు. తక్షణమే ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ధరలు పెరిగిన సరుకులను సబ్సిడీ ధరలకు రైతు బజార్లో ప్రభుత్వమే అమ్మకాలు చేయాలని కోరారు. అనంతరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బలిజిపేట మండలానికి చెందిన జనసైనికులు పాల్గొన్నారు.