కడప అర్బన్ : ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న కడప రైతు బజార్‌లో సబ్సిడీ టమోటాల కోసం ప్రజలు బారులు తీరారు. రోజుకు రెండు టన్నుల టమోటాలు 2000 మందికి విక్రయించాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో టమోటా ధర కిలో రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతూ ఉంది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ టమోటాలు రూ.50 విక్రయిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు టమా టాలు ఖాళీ అవుతున్నాయి. పోలీస్ బందోబస్తు లేకపోవడంతో తోపులాట చోటు చేసుకుంటోంది. అధికారులు స్పందించి పోలీస్ బందోబస్తు మధ్య టమోటాలు పంపిణీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. సబ్సిడీ టమోటాల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడాల్సి వస్తుంది. అధికార, రాజకీయ పలుకుబడి కలిగిన వారికి లైన్‌లో లేకపోయినా టమోటాలు పంపిణీ చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. వందల సంఖ్యలో ప్రజలు కిలో మీటర్ మేర క్యూ కడుతున్నారు. రైతు బజార్ ఎదుట మురుగునీరు నిల్వ ఉండడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మురుగునీరును తొలగించాలని పలువురు కోరుకుంటున్నారు.










