Sep 01,2023 21:02

మదనపల్లె మార్కెట్‌కు వచ్చిన టమోటాలు

మదనపల్లె అర్బన్‌ : వారం రోజుల వ్యవధిలోనే టమోటా ధరలు భారీగా పతనం అయ్యాయి. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయని కొందరు అంటుంటారు. ఇది మనుషులకే కాకుండా కూరగాయలకు కూడా వర్తిస్తుందని ప్రస్తుతం కొందరు చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు కాసులు పలికించిన టమోటా.. ఇప్పుడు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. 30 రోజుల కిందటి వరకు కిలో టమోటా రూ.196 పలికింది. ప్రస్తుతం ఒక్కసారిగా టమోటా ధరలు పాతాళానికి పడిపోయాయి. మదనపల్లి మార్కెట్‌లో కిలో టమోటా కేవలం రూ.9గా పలుకుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమోటాలతో కోటీశ్వరులు అయిన కొందరు రైతులను చూసి ఆనందించిన వారికి ఇప్పుడు తాజా పరిస్థితులు ఆవేదనకు గురిచేస్తున్నాయి.
జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమాటా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జులై 30న మార్కెట్‌ చరిత్రలోనే కిలో టమాటా అత్యధికంగా రూ.196 పలికిన సంగతి తెలిసిందే. నెల రోజులుగా దిగుబడి పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏ గ్రేడ్‌ కిలో టమాటా రూ.10 నుంచి రూ.15, బి గ్రేడ్‌ రూ.5 నుంచి రూ.9గా ఉంది. సగటున కిలో టమాటా రూ.9 నుంచి రూ.15 ఉంది. జులై నెలలో కిలో టమోటా ఎన్నడూ లేని విదంగా రికార్డు స్థాయిలో రూ.196 అమ్మి టమోటాలను మధ్యతరగతి కుటుంబాలు కొనలేక అవస్థలు పడ్డాడు. రోజు రోజుకు టమోటా దిగుబడి పెరగడం, ఇతర రాష్ట్రాలలో జిల్లాలలో టమోటా పంట సాగు పెరగడంతో రేట్లు తగ్గాయని వ్యాపారస్తులు అంటున్నారు. గురు, శుక్రవారాల్లో మదనపల్లె మార్కెట్‌ యార్డ్‌లో టమోటా రేట్లు ఈ విధంగా ఉన్నాయి. గురువారం మొదటి రకం 10 కిలోల టమోటా గరిష్టంగా రూ.220 పలకగా కనిష్టంగా రూ.210, రూ.170 పలికింది. రెండవ రకం గరిష్టంగా రూ168 పలకగా కనిష్టంగా రూ.140, రూ.90 పలికింది. 295 మెట్రిక్‌ టన్నుల టమోటా మార్కెట్‌కు వచ్చింది. శుక్రవారం మొదటి రకం 10 కిలోల టమోటా గరిష్టంగా రూ.220 పలకగా కనిష్టంగా రూ.210, రూ.170 పలికింది. రెండవ రకం గరిష్టంగా రూ168 పలకగా కనిష్టంగా రూ.140, రూ.90 పలికింది. 204 మెట్రిక్‌ టన్నుల టమోటా మార్కెట్‌కు వచ్చింది. అప్పుల ఊబిలో నుండి బయటపడుతున్న తరుణంలో ఇలా ఒక్కసారిగా రేట్లు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిలకడగా టమోట రేట్లు ఉండేలా చూడాలని రైతులు కోరుతున్నారు.