టెలికం రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డిఐ) ఇప్పటివరకు ఉన్న 49 శాతం పరిమితిని ఏకంగా వంద శాతానికి పెంచడం, సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాల (ఎజిఆర్) బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల దోపిడీకి పూర్తి అవకాశాన్ని కల్పించింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో టెలికం రంగంలో ఎఫ్‌డిఐ లకు ప్రభుత్వ అనుమతి కూడా అవసరం లేకుండా ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతించడంతోబాటు, వాహన తయారీ, విడి భాగాల తయారీ, డ్రోన్ల తయారీ పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ప్రకటించడం బేహారులకు సాగిలపడడమే. ప్రధాని మోడీ వచ్చే వారం అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో శ్వేత సౌధాధీశుని ప్రాపకం కోసం సర్కారు ఈ చర్యలను ప్రకటించిందన్న విషయం అందరికీ తెలుసు. ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడల్లా విదేశీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేే చర్యలను ప్రకటించడం ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది.
టెలికామేతర ఆదాయాలను ఎజిఆర్ నుంచి మినహాయించడం, సుంకాలు చెల్లించే ఆదాయం నిర్వచనం మార్పుతో సహా స్పెక్ట్రమ్ వేలంలో నిబంధనల మార్పు, కాలవ్యవధి పెంపు వంటి అనేక చర్యలతో 9 సంస్కరణలను కేంద్రం ప్రకటించింది. ఇక నుంచి స్పెక్ట్రమ్‌ను పంచుకోవచ్చు. లేదంటే మిగిలిపోయిన స్పెక్ట్రమ్‌ను తిరిగి అప్పగించవచ్చన్నారు. భవిష్యత్ వేలంలో స్పెక్ట్రమ్ కాల వ్యవధి 20 సంవత్సరాలకు బదులుగా 30 సంవత్సరాలు చేయనున్నారు. వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో లైసెన్స్ ఫీజు కింద రూ.92 వేల కోట్లు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల కింద రూ.41 వేల కోట్లు చెల్లించవలసి ఉంది. నాలుగేళ్ల మారటోరియం మూలంగా వారెంతగా లాభపడతారో వేరే చెప్పనక్కరలేదు. కరువు లేదా వరద వచ్చింది ఒక్క ఏడాది రుణాలు రీషెడ్యూల్ చేయండి అని అన్నదాతలు ఘోషిస్తే ఆర్థిక క్రమశిక్షణ గురించి పాఠాలు వల్లించే పాలక పెద్దలు కార్పొరేట్లకు ఏకంగా నాలుగేళ్లపాటు మారటోరియం ఇచ్చారు. సాధారణ రైతు లేదా చిరు వ్యాపారి కేవలం పది వేల రూపాయలు బకాయి ఉన్నా కోర్టు కేసులు, డిక్రీలు, జప్తులకు ఉసిగొలిపే సర్కారువారు శత కోటీశ్వరులకు మాత్రం ఇలా చేయడంతో ఏలినవారు ఎవరి సేవలో తరిస్తున్నారో తేటతెల్లం అవుతోంది. త్వరలో రానున్న 5జి స్పెక్ట్రం వేలంలో దేశ విదేశీ టెలికం కార్పొరేట్లు యథేచ్ఛగా పాల్గొనడానికీ దేశీయ టెలికం రంగాన్ని వారికి అప్పనంగా అప్పగించడానికే మోడీ సర్కారు ఈ ఏర్పాట్లు చేస్తుందన్నది నిర్వివాదాంశం.
వచ్చే ఐదేళ్లలో రూ.26,058 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను వాహన పరిశ్రమకు అందించడం ద్వారా ఐదేళ్లలో రూ.42,500 కోట్లు కొత్త పెట్టుబడులు రావొచ్చని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. నూతన ప్రోత్సాహకాలతో పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలు వస్తాయంటోంది. అయితే, ఈ రాయితీలతో దేశీయ ఆటోమొబైల్ కంపెనీలకన్నా అంతర్జాతీయ మోతుబరి టెస్లా కంపెనీకే ఎక్కువ లబ్ధి కలుగుందని వార్తలొస్తున్నాయి. డ్రోన్ల కోసం ప్రకటించిన స్కీమ్ వల్ల మూడేళ్లలో కొత్తగా రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అదీ పేలపిండి కథ మాదిరి కావచ్చు.
ఒకవైపు ఆర్థిక సంక్షోభం మరోవైపున కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్య ప్రజానీకాన్ని ఆదుకోవాలని దేశమంతటా జనం గగ్గోలు పెడుతుంటే దాన్ని పెడచెవిన పెట్టిన ప్రభుత్వం కార్పొరేట్లకు భారీ నజరానాలు ప్రకటించడం దారుణం. సామాన్యులను గాలికొదిలేసి సంపన్నుల ప్రయోజనాల కోసం పరితపిస్తున్న మోడీ సర్కారు నిజ స్వరూపాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తొమ్మిది మాసాలుగా మొక్కవోని దీక్షతో అన్నదాతల ఉద్యమం సాగుతోంది. లేబర్ కోడ్‌ల రద్దు, కనీస వేతనాలు తదితర డిమాండ్లపై కార్మిక వర్గం సంఘటిత పోరాటాలు సాగిస్తోంది. ఉపాధి కోసం నిరుద్యోగ యువత, ప్రభుత్వ విద్య కోరుతూ విద్యార్థులు, అత్యాచారాలు, అమానుషాలకు వ్యతిరేకంగా మహిళలు...ఇలా అన్ని వర్గాలు తరగతుల ప్రజానీకం కేంద్రంలోని కార్పొరేట్-హిందూత్వ కూటమి దుష్ట పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. వీటన్నిటినీ ఉచ్ఛ స్థాయికి గొనిపోయేదే సెప్టెంబర్ 27 భారత్ బంద్. దాన్ని జయప్రదం చేయడం దేశ ప్రయోజనాలను అభిలషించే ప్రతి ఒక్కరి కర్తవ్యం.










