
ప్రజాశక్తి - సంతమాగులూరు
స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ హాస్టల్‌లోని విద్యార్థులు రెండేళ్లుగా సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ హాస్టల్‌లో ఈ ఏడాది 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 70మంది ఉన్నారు. హాస్టల్‌లో 15మరుగుదొడ్లు, నాలుగు బాత్రూం గదులు ఉన్నాయి. మరుగు దొడ్లకున్న తలుపులు విరిగిపోయాయి. మరుగుదొడ్లను శుభ్రం చేసేవారు లేక దుర్వాసన వెదజల్లుతున్నాయి. విద్యార్థులున్నా మరుగుదొడ్లను ఉపయోగించుకోలేక హాస్టల్ బయట ఉన్న పొలాలలోకి వెలుతున్నారు. ఇక వసతి గృహంలోని తలుపులు, కిటికీలు శిథిలావస్థకు చేరి విరిగిపోయాయి. గదులలోని విద్యుత్ స్విచ్ బోర్డులు ఊడిపోయి వేలాడుతున్నాయి. గదులలో ఉన్న ఫ్యాన్లు రిపేరుకు గురై తిరగడంలేదు. వసతి గృహానికి తలుపులు లేనందున రాత్రులందు చలికి ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ లేని సమయంలో గదిలో ఉన్న ఒక్క ఫ్యాన్ తిరగక పోవడంతో దోమకాటుకు గురవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో వార్డెన్‌తో పాటు, వాచ్ మెన్, వంటవారు ఉన్నారు. ఇటీవల జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా హాస్టల్ వార్డెన్ బి ఫ్రాంక్లీన్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టల్‌లో నెలకొని ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.