Oct 25,2023 17:55

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
   ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్‌క్రాస్‌ తలసేమియా కేంద్రంలో బుధవారం 11 మంది తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి నిర్వహించినట్లు జిల్లా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా చిన్నారులకు రక్తమార్పిడితో పాటు వారికి కావాల్సిన మందులను కూడా తెప్పించి, అందుబాటులో ఉంచుతున్నామన్నారు. తలసేమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధి చిన్నారులు వ్యాధి నిర్థారిత పత్రాలతో రెడ్‌క్రాస్‌ తలసేమియా భవనంలో నమోదు చేయించుకుని, ప్రభుత్వం నెల నెల అందించే రూ.10 వేలకు అర్జీ పెట్టుకోవాలని తెలిపారు. బుధవారం తలసేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు 30 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన దాత మానవత సభ్యులు మాడ సీతారత్నంకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కార్యదర్శి కెబి సీతారాం, డాక్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌కె.వరప్రసాదరావు, మానవత సభ్యులు మేతర రాజబాబు, రత్నాకరరావు, మానేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.