ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె మండలం పోటుమెరక, తుమ్మల, పిరాట్లంక, చోడాయపాలెం, విశ్వేశ్వరం గ్రామాలలో చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ క్రాఫ్ ఆధ్వర్యంలో గ్రామ బాలల రక్షణ కమిటీ ఇసిసిడి, తల్లుల కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో ఉన్న గర్భిణులు, బాలింతలు 20 మందితో సమావేశం ఏర్పాటు చేశారు. శిశువు గర్భదశ నుంచి ఎలా ఎదుగుతారో, పెరుగుదల ఎలా ఉంటుందో ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదో మొదలైన విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్స్ నాంచారమ్మ పాల్గొని మాట్లాడారు. అంగన్‌వాడీ సెంటర్లలో గర్భిణులకు, బాలింతలకు మంచి పోష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. బాలింతలుగాని, గర్భిణులు గాని, ఎవ్వరైనా అనారోగ్యంతో బాధపడితే వెంటనే స్థానిక ఏఎన్‌ఎం వారికి, లేదా అంగన్‌వాడీ టీచర్‌కు చెప్పాలని సూచించారు. గర్భదశలో ఉన్న శిశివు నుంచి 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల ఎదుగుదల, వారి మానసిక ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియపరిచేదే ఐసిసిడి అని తెలిపారు. గర్భిణిగా ఉన్నపుడు పాటించే పద్ధతుల గురించి, శిశువు పుట్టిన తరువాత పాటించే పద్ధతులు గురించి క్లుప్తంగా వివరించారు. పిల్లలను చూసుకోవడంలో తల్లి బాధ్యతనే కాకుండా తండ్రి బాధ్యత కూడా ఉంటుందని, అప్పుడే పిల్లలు మంచి ప్రవర్తనతో ఎదుగుతారని చెప్పారు. కార్యక్రమానికి చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ - క్రాఫ్ కమ్యూనిటీ ఆర్గనైజర్స్ పి ఆషా సంధానకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో, బాలింతలు, గర్భిణులు, తల్లులు, బాలలు, అంగన్‌వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.










