ప్రజాశక్తి - కురుపాం : తల్లిపాలతోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసిడిఎస్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి.చిన్మయిదేవి అన్నారు. శుక్రవారం మండలంలో గుమ్మ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలు తాగడం వల్ల బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుండి మూడేళ్లపాటు తల్లిపాలు క్రమం తప్పకుండా అందించాలని సూచించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాల్లో చేపడుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పీడీ కె.విజయగౌరి, తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ : నూతనంగా ఏర్పాటు చేసిన కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్టును ఆర్‌జెడి చిన్మయిదేవి సందర్శించారు. అనంతరం స్వామినాయుడువలస అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడి కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రీస్కూలును పరిశీలించి పలు విషయాలపై చర్చించారు. ఆరుగురు గర్భిణులకు సీమంతాలు చేశారు. కార్యక్రమంలో సిడిపిఒ సుగుణ, సెక్టార్ సూపర్‌వైజర్ ఎల్.శారదాంబ, అంగన్వాడీ కార్యకర్త లత పాల్గొన్నారు.










