ప్రజాశక్తి-రామభద్రపురం : విజయనగరంజిల్లా రామభద్రపురం మండల కేంద్రంలో శుక్రవారం దారుణం చోటుచ చేసుకుంది. మద్యానికి బానిస అయిన కుమారుడు తన తల్లిని కిరాతకంగా హింసించి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రామభద్రపురంలోని వసంతుల వీధికి చెందిన ఉప్పల రమణమ్మ(78)కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారులలో ఒకరు చనిపోగా ఇద్దరు కుమారులకు, కుమార్తెలకు వివాహాలు అయ్యాయి. మూడో కుమారుడు ఉప్పల శ్రీను(45) చిన్నతనం నుంచి వ్యసనాలకు బానిసై పని పాటా లేకుండా చిల్లర తిరుగుళ్ళుకు అలవాటు పడ్డాడు. నిత్యం మద్యం తాగుతూ తల్లిని వేధించేవాడు. దీంతో చెడు తిరుగుళ్ళు మాని ఏదైనా పని చేసుకోవాలని తల్లి నిత్యం మందలిస్తుండేది. అయినా ఆయనలో మార్పు లేదు. తల్లికి వచ్చే వృద్ధాప్య పింఛను డబ్బులు కూడా కాజేసి మద్యం తాగేసేవాడు. గురువారం రాత్రి కూడా పూటుగా మద్యం సేవించి రావడంతో తల్లి మందలించింది. అప్పటికే మద్యం మత్తు ఎక్కువగా ఉండడంతో విచక్షణ కోల్పోయి, పేగు బంధాన్ని మరిచి దాడికి పాల్పడ్డాడు. నాలుక తెంచి, సుత్తితో పలు దపాలుగా మోది హత్య చేశాడు. ఉదయం ఆ నాలుకను పట్టుకొని స్టేషన్‌కు వెళ్లి తన తల్లిని చంపేసినట్లు చెప్పాడు. ఇన్‌ఛార్జిగా ఉన్న బాడంగి ఎస్‌ఐ జయంతి, ఎఎస్‌ఐ చిన్నారావు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేశారు. పెద్దల సమక్షంలో పంచనామా నిర్వహించ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేంద్ర నాయుడు తెలిపారు.










