Aug 31,2023 00:32

రక్తదానం చేసేందుకు వచ్చిన కుటుంబీకులు, బంధువులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : మెదడు నరాలు దెబ్బతిని, సమయానికి రక్తం అందక మరణించిన చెందిన తల్లికి నివాళిగా ఎనిమిదేళ్ల నుండి రక్తదానం చేస్తున్న కుటుంబీకులు బుధవారమూ రక్తదానం చేశారు. మండల కేంద్రమైన రొంపిచర్లకు చెందిన కృష్ణా జిల్లాలో జడ్జిగా పని చేస్తున్న సరికొండ చినబాబు, ఆయన సోదరుడు, అధ్యాపకులు లెనిన్‌బాబు, మేనల్లుడు కూరపాటి శివరామరాజు, సమీప బంధువు, దంత వైద్య నిపుణులు సంపత్‌ ఇతర కుటుంబ సభ్యులు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పనసతోటలో గల పల్నాడు బ్లడ్‌ బ్యాంక్‌లో బుధవారం రక్తదానం చేశారు. జడ్జి చినబాబు మాట్లాడుతూ రక్తం అందక ఎవరూ మృతి చెందకూడదనే సంకల్పంతో తమ తల్లి లక్ష్మమ్మ వర్థంతి సందర్భంగా తమతో పాటు తమకు తెలిసిన వారితో రక్త దానం చేయిస్తున్నామన్నారు. ప్రతి ఏడాది సత్తెనపల్లి, విజయవాడ ప్రాంతాల్లో రక్త దానం చేస్తామని, ఇప్పుడు సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్‌ సూచన మేరకు తమ ప్రాంతమైన నరసరావుపేటలో చేశామని చెప్పారు. కార్యక్రమంలో చినబాబు భార్య అయిన జడ్జి పద్మ, కుటుంబీకులు పాల్గొన్నారు.
రక్త దానం పట్ల అపోహలు వీడాలి : బ్లడ్‌ బ్యాంక్‌ అధినేత కె.జానకిరామయ్య
లేనిపోని అపోహల వీడి రక్తదానానికి ముందుకు రావడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణం పోయాలని పలనాడు బ్లడ్‌ బ్యాంక్‌ అధినేత కె.జానకి రామయ్య అన్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేస్తే వారికి, వారి కుటుంబ సభ్యులకు, తెలిసిన వారికి అవసరమైన సమయంలో తమ బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఉచితంగా రక్తం సరఫరా చేస్తామన్నారు. ఇదే కాకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారికి తమ బ్లడ్‌ బ్యాంక్‌ తరఫున రూ.5 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.