Sep 29,2022 23:05

సెల్‌ఫోన్లు అందజేస్తున్న ఎంపి మాధవి, తదితరులు

ప్రజాశక్తి-పాడేరు: సంపూర్ణ పౌష్టికాహారంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులంతా ఆరోగ్యంగా ఉంటారని, తల్లీబిడ్డల క్షేమమే ప్రభుత్వం ధ్యేయమని అరకు ఎంపి గొడ్డేటి మాధవి పిలుపునిచ్చారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులోని కాఫీ గెస్ట్‌ హౌస్‌లో ఐసిడిఎస్‌ శాఖ పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహించింది. ఎంపి గొడ్డేటి మాధవి, జడ్‌పి చైర్మన్‌ జల్లిపల్లి సుభద్ర, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో సంపూర్ణ పౌష్టికాహారం అందించే లక్ష్యంగా సిఎం జగన్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, అలాగే గిరిజన ప్రాంతాల్లో లభ్యమయ్యే కందులు, గుమ్మడి, చిరుధాన్యాల పంటల వినియోగంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులందరికీ అంగన్వాడీ కేంద్రాల్లోనే పౌష్టికాహారాన్ని వండిపెట్టాలన్నారు. పాలు, గుడ్డు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం లక్ష్యంగా అందరు పని చేయాలని సూచించారు.
జడ్‌పి చైర్మన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ, అన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన సేవలు అందించి మహిళల్లో రక్తహీనత సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. కిశోర్‌ బాలికలు, గర్భిణీలు, బాలింతలందరికి పౌష్టికాహారంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్య ఆరోగ్య కార్యక్రమాలను అంగన్వాడీ కేంద్రాల్లో విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పలు అంగన్వాడీల సిబ్బంది తయారు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించి వాటి రుచి చూసారు. ఆలాగే గర్భిణీలకు సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రాసన చేసారు. ప్రభుత్వం అందుబాటులో తెచ్చిన మొబైల్‌ ఫోన్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ పిడి సూర్యలక్ష్మి. పలు ప్రాజెక్టుల సిడిపిఒలు పాల్గొన్నారు.