శ్రవణ కుమారుడి కథ చాలామందికి తెలుసు. పుణ్యక్షేత్రాలను దర్శించే భాగ్యం తమకు లేదని కుమిలిపోతున్న తల్లిదండ్రుల కోర్కె తీర్చాలని అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకొని తీర్థయాత్రలకు బయల్దేరతాడు. అడవి మార్గాన వెళుతుండగా, దశరథ మహారాజు బాణం దెబ్బకు శ్రవణుడు మరణించడంతో... మాకు పుత్రశోకం మిగిల్చిన నువ్వు కూడా పుత్రశోకంతోనే మరణిస్తావని శ్రవణుడి తల్లిదండ్రులు దశరథుడ్ని శపిస్తారు. ఇదొక పురాణగాథే అయినా... తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలకు, బిడ్డలను ప్రాణప్రదంగా భావించే తల్లిదండ్రులకు ఈ కథ ఒక ఆదర్శం. 'అమృతం దొరికితే పంచుకునేవాళ్లు దేవతలు... అదే అమృతం దొరికితే పిల్లలకు పంచిపెట్టేవాళ్లు అమ్మానాన్నలు' అంటాడో కవి. అమ్మ ఈ ప్రపంచంలోకి తీసుకొస్తే నాన్న ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. అమ్మ చంకనెత్తుకొని 'చందమామ రావె... జాబిల్లి రావె' అంటూ గోరుముద్దలు తినిపిస్తుంది. చేయి పట్టుకొని ఊరంతా చూపిస్తాడు నాన్న. తాము నెరవేర్చుకోలేకపోయిన ఆశలను తమ బిడ్డల ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటారు తల్లిదండ్రులు. దానికోసం ఎంత కష్టమైనా భరిస్తారు. చివరకు పస్తులుండి కూడా... బిడ్డల కడుపు నింపుతారు. తమ ఆశలకు ప్రతిరూపాలుగా.... తమ కలలకు ప్రతిబింబాలుగా భావిస్తారు. అలాంటి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పూర్తిగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది.
అనుబంధాలు, ఆత్మీయతలతో కట్టుకున్న అందమైన పొదరిల్లు జీవితం. ఈ అందమైన జీవితంలోకి ప్రపంచీకరణ దొంగలా చొచ్చుకు వచ్చింది. 'అడుగడుగో అడుగో సూడు సూడు అమెరికోడు వస్తుండు/ తల్లీ భారతి ఎదలమీద సూడు సూడు పాదాలు మోపినాడు/ మన ఇంట్లోనూ, పొలములోనూ ఎక్కడ చూసినా వాడే....' అంటూ నట్టింట్లోకి చొచ్చుకొని వచ్చిన సామ్రాజ్యవాదం గురించి చెబుతాడు గద్దర్. నట్టింట్లోకి నడిచొచ్చిన సామ్రాజ్యవాదం... కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పొదరిల్లు వంటి కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. ఆశల లోకంలో విహరిస్తూ... అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను సైతం గాలికొదిలేసి ఆశల తీరాల వెంట పరుగులు పెడుతున్నారు పిల్లలు. అంతేకాదు... డబ్బు కోసం తల్లిదండ్రులను హతమార్చడానికి కూడా వెనుకాడటం లేదు. 'మనిషి విసిరేయబడుతున్నాడిప్పుడు/ ఊరికొక్కడు దేశానికొక్కడుగా/ వృద్ధులైన తల్లిదండ్రులు పల్లెటూళ్లలో/ కన్నబిడ్డలు చదువులకని హాస్టళ్లలో/ ఇక్కడ తల్లిదండ్రులు తీరికలేని బిజీలో/ అక్కడ తల్లిదండ్రులు ఆలన లేని వేదనలో/ మనిషి జీవితంలో ఇదో విషాదఘట్టం' అంటాడో కవి. ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో, ఇళ్లల్లో అనాథలుగా బతుకులీడ్చే తల్లిదండ్రులది ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదగాథ. ఈ చరిత్రలను ఏ సిరాతో రాసినా... సారాంశం ఒక్కటే. బతుకుదెరువు కోసం ఉన్న ఊరుని, కన్నవాళ్లని వదిలేసి పట్టణాలకు, విదేశాలకు వలసపోతున్న కన్నీటి కథలే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు... ప్రపంచీకరణతో పెనవేసుకుపోయాయి. చదువుకున్నవారికి ఉద్యోగాలు చూపలేక, రైతులకు భరోసా ఇవ్వలేక, వృద్ధులకు అసరా ఇవ్వలేక చేతులెత్తేశారు. పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను మాత్రం ప్రభుత్వాలు తమ భుజాలపై మోస్తున్నాయి.
'బూర్జువా వర్గం కుటుంబ వ్యవస్థ మీద వున్న మమకారపు మేలి ముసుగును లాగిపారేసి, కుటుంబ సంబంధాలను కేవలం ఆర్థిక సంబంధాలుగా దిగజార్చింది' అని 'కమ్యూనిస్టు ప్రణాళిక'లో బూర్జువా వర్గ డొల్లతనాన్ని బట్టబయలు చేస్తాడు కారల్ మార్క్స్. ఈ వ్యవస్థ మారాలి. సమసమాజం రావాలి. శ్రమ చేసే వారందరికీ ఉద్యోగాలివ్వాలి. వృద్ధులకు ప్రభుత్వం ఆసరానివ్వాలి. కుటుంబ వ్యవస్థను కాపాడాలి. పిల్లలు శ్రవణుడిలా తల్లిదండ్రులను ప్రేమించగలిగితే... ఒంటరితనంతో మిగిలిపోయేవారు, వృద్ధాశ్రమాలకు నెట్టబడేవారు వుండరు. 'ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు... కావాలి ముందు ముందు పొదరిల్లు' అన్నట్టుగా... ప్రతి కుటుంబం ఓ అందమైన బృందావనం అవుతుంది. తల్లిదండ్రుల కళ్లలో కోటి దీపాలు వెలుగుతాయి. అప్పుడే నిజమైన తల్లిదండ్రుల దినోత్సవం.










