భోజన వసతి కల్పించరు
తల్లిదండ్రులను వేధిస్తే కఠిన చర్యలు
-ఎస్‌పి డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి హెచ్చరిక
ప్రజాశక్తి-నెల్లూరు :జన్మనిచ్చి,విద్యాబుద్దులు నేర్పి జీవితాలకు బంగారు బాటలు వేసిన తల్లిదండ్రులను ఆస్థి కోసం వేదించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పిల్లలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఎస్‌పి డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని ఉమేష్‌చంద్రా కాన్ఫరెన్స్ హాల్ ప్రాంతంలో నిర్వహించిన 'స్పందన' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో 103 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి స్పందన కార్యక్రమానికి హాజరైన ఫిర్యాదుదారులు అందరికీ భోజన వసతి కల్పించడంతోపాటు దాహార్తీ తీర్చేందుక మజ్జిగ అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాబ్ కన్సల్టెన్సీ ద్వారా ఆన్ లైన్, వివిధ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డబ్బు కట్టి మోసం పోవద్దని ప్రజలకు సూచనలు చేశారు. భార్యాభర్తల మనస్పర్దలతో స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే వారికి పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబాలు చక్కదిద్దాలని సూచించామన్నారు. జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో ఇప్పటి వరకు నమోదుకాబడిన దొంగతనం, మిస్సింగ్, కిడ్నాప్ కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, చార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా ఛార్జీ షీట్‌ను దాఖాలు చేయాలని, పోలీసులు తమ విధుల పట్ల ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం ప్రదర్శించరాదన్నారు. స్పందన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబందిత అధికారులతో మాట్లాడి, త్వరితగతిన పరిష్కరించి భాధితులకు న్యాయం చేయాలని సూచనలు చేశారు. ముఖ్యంగా భర్త/అత్తారింటి వేధింపులు, భూ, ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్ లైన్, అనధికార చీటీలు, ఇతర వివాదాలు తదితర సమస్యల స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి, డిటిసి, ఎస్‌సి,ఎస్‌టి సెల్ -2 , దిశ, ఎస్‌బి సిఐ, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.










