ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
మానవత విద్యా నిధి ఛైర్మన్, బాల వికాస్ భారతి ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు తల్లి కమలావతి ప్రథమ వర్థంతి సందర్భంగా బాల వికాస్ భారతి ఆధ్వర్యంలో ఎవిఆర్ విజ్ఞాన కేంద్రంలో బుధవారం వృద్ధులకు, బాలలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. బాల వికాస్ భారతి ప్రెసిడెంట్, న్యాయవాది కట్టా సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి పవర్‌పేట వాసు దేవాలయం, చిట్టివలస పాకల ప్రాంతంలోని వృద్ధులు, బాలబాలికలు, ఎఎస్‌ఆర్ స్టేడియంలో వ్యాయామ శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలో ప్రతిఒక్కరూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల యోగక్షేమాలు జీవితాంతం చూడాల్సిన బాధ్యత, అవసరం ప్రతి వ్యక్తిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరికి తొలి గురువు అమ్మే కావడం అదృష్టంగా భావించాలని సభకు అధ్యక్షత వహించిన కట్టా సత్యనారాయణ తెలిపారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారి కష్టాలను దిగమింగుకొని పిల్లల బాగు కోసం, యోగక్షేమాల కోసం నిరంతరం ఆలోచిస్తారని, అలా మన కోసం ఆలోచించే తల్లిదండ్రులను నిరంతరం గుర్తుపెట్టుకోవాలని, వారి ఆలోచనలు, కోరికల ప్రకారం సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆలపాటి నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యఅతిథిగా ఫాదర్ బాల, జెఎంజె బిఇడి కాలేజ్ కరస్పాండెంట్ మాట్లాడుతూ జన్మనిచ్చిన అమ్మ త్యాగాన్ని, అమ్మ ప్రేమను ఏ ఒక్కరూ మరువకూడదన్నారు. అనంతరం 15 రోజులకు సరిపడా పౌష్టికాహారం వృద్ధులకు, పిల్లలకు ఆలపాటి నాగేశ్వరరావు అందించారు. బాలవికాస్ భారతి జాయింట్ సెక్రటరీ పి.దుర్గాప్రసాద్ సభకు హాజరైన వారిని వేదికపైకి ఆహ్వానించి, కార్యక్రమం ముగింపులో వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహరావు, ఏలూరు మానవత సంస్థ కార్యదర్శి మేతర అజరు బాబు, విజ్ఞాన కేంద్రం సభ్యులు విజిఎం కృష్ణారావు, మానవత సంస్థ నాయకులు పి.రత్నాకర్‌రావు, కరుణోదయ మానసిక వికలాంగుల సంస్థ ఛైర్మన్ డోమ్నిక్, బాలవికాస్ భారతి, ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం, మానవత సంస్థ, లయన్స్ క్లబ్ తదితర సేవా సంస్థల నాయకులు పాల్గొన్నారు.










