Feb 04,2023 17:36

పోలీసులకు పలువురి అభినందనలు
ప్రజాశక్తి - మండవల్లి

                 తప్పిపోయిన బాలుడి ఆచూకీని పోలీసులు చాకచక్యంతో 24 గంటలు గడవకముందే కనిపెట్టి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. దీంతో పోలీసులను తల్లిదండ్రులతో పాటు పలువురు అభినందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అప్పాపురానికి చెందిన ధర్మరాజుల రాంబాబుకు 13 సంవత్సరాల వయస్సు కలిగిన ధర్మరాజులు కొండామణిదీప్‌ ఉన్నాడు. మణిదీప్‌ మండవల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల రెండో తేదీన యధావిధిగా పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్ల వద్ద గాలించగా కొండా మణిదీప్‌ ఆచూకీ కానరాలేదు. దీంతో తల్లిదండ్రులు శుక్రవారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు డిఎస్‌పి పైడేశ్వరావు ఆధ్వర్యంలో సిఐ వైవిఎల్‌.నాయుడు పర్యవేక్షణలో బృందాలను ఏర్పాటు చేసి బాలుడు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం నరసాపురం రైల్వేస్టేషన్‌లో ఏడుస్తూ తిరుగుతున్న బాలుడిని మండవల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎఎస్‌ఐ కాకొల్లు రాజు తెలిపారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బాలుడి ఆచూకీ కనిపెట్టి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంపై అప్పాపురం గ్రామస్తులు, బాలుని తల్లిదండ్రులు, బంధువులు, పలువురు ప్రముఖులు మండవల్లి పోలీసులను అభినందించారు.